CM Jagan False Statements on Visakha Capital Issue: మాట తప్పను. మడప తిప్పను ఇదీ సీఎం జగన్ అనేక సభలలో చెప్పే మాట. కానీ మాట తప్పి, మడమ తిప్పితేనే జగన్ అంటారని అనేది గత అయిదేళ్ల పాలన చూసి ప్రజలు అంటున్న మాట. అమరావతి రాజధానికి తాను అంగీకరిస్తానని, అభివృద్ధి చేస్తానని నాడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిన జగన్. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలనను మొదలు పెట్టి, రాజధాని విషయంలో తన రూటు ఏమిటో చెప్పకనే చెప్పారు.
అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే మూడు రాజధానులు అంటూ మాట మార్చారు సీఎం జగన్. అయిదేళ్లలో అమరావతిలో ఒక్క బిల్డింగ్ కూడా కట్టింది లేదు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని చేస్తాం అని ప్రకటించి, అక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదు. విశాఖ పర్యాటకానికి మణిహారంలా ఉండే రుషికొండను పూర్తిగా తొలిచి నాశనం చేశారు. దీనిపై న్యాయస్థానాలు సైతం మొట్టికాయలు వేసినా తీరు మాత్రం మార్చుకోలేదు.
విశాఖపై మళ్లీమళ్లీ: విశాఖ విషయంలో తొలినుంచీ రోజుకో మాటమారుస్తూ వచ్చారు సీఎం జగన్, అతని అనుచరగణం. తొలుత మూడు రాజధానులు అని, విశాఖ కార్యనిర్వాహక రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామంటూ ప్రకటించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి, రాష్ట్రాన్ని గాలికొదిలేశారు. అమరావతిలో ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేదు. తరువాత విశాఖకి వస్తున్నా అంటూ మరో మాట మార్చారు.
రుషికొండపై మరో'సారీ': తొలుత రుషికొండలో నిర్మాణాలను మొదలు పెట్టిన ప్రభుత్వం, అవి పర్యాటకానికి సంబంధించినవి అని పేర్కొంది. కానీ ఒకానొక సందర్భంలో వైసీపీ అధికారక ట్విటర్ ఖాతా నుంచి వాటిని సచివాలయ భవనాలు అని తెలిపారు. అయితే కొద్దిసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. రుషికొండపై భవనాలు ప్రారంభం అయినప్పటి నుంచీ అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దానికి వైసీపీ నేతల మాటలు సైతం ఊతమిస్తున్నాయి.
ఎట్టకేలకు తొలగిన ముసుగు: రుషికొండపై భవనాలు కట్టకూడదా? అక్కడ ముఖ్యమంత్రి ఉండకూడదా? అంటూ ఒకానొక సందర్భంలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అదే విధంగా మంత్రి అమర్నాథ్ సైతం అక్కడ నిర్మాణాలు ప్రభుత్వ అవసరాల కోసమంటూ సెలవిచ్చారు. తాజాగా రుషికొండపై నిర్మాణాలను రహస్యంగా ప్రారంభించింది ప్రభుత్వం. ఆ సమయంలో రుషికొండ నిర్మాణాలు సీఎం క్యాంపు కార్యాలయంగా ఉంటే బాగుంటుందని మంత్రి రోజా పేర్కొన్నారు. దీంతో రుషికొండపై నిర్మాణాలు విశాఖలో ముఖ్యమంత్రి ఉండటానికే నిర్మించారని అంతా కలిసి చెప్పకనే చెప్పారు.
ముఖ్యమంత్రి మాటలకు అర్థాలే వేరులే: దసరాకి వచ్చేస్తా. సంక్రాంతికి పక్కా. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ విశాఖకు రాజధాని మార్పుపై ముఖ్యమంత్రి ఒక్కో తేదీని ప్రకటిస్తూ వచ్చారు. ఇక తాజాగా 'విజన్ విశాఖ' సదస్సులో మరోసారి సీఎం అయితే ఇక్కడే ఉంటా అంటూ తెలిపారు. అయితే అయిదేళ్ల వైసీపీ పాలనలో విశాఖను అభివృద్ధి చేసింది మాత్రం శూన్యం. ఎప్పటికప్పుడు అదిగో రాజధాని, ఇదిగో అభివృద్ధి అంటూ ప్రజలను మోసగిస్తూనే వచ్చారు.
బడాయి మాటల జగనన్న: నిన్న మొన్నటి వరకూ విశాఖకు వచ్చేస్తా అనే జగనన్న, ఇక ఇప్పుడు ఏదైనా సరే ఎన్నికల తర్వాత ఇక్కడే ఉంటా, ఈసారి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. విశాఖను అభివృద్ధి చేస్తానని, చెన్నై, హైదరాబాద్‌కు దీటుగా చేస్తానని బడాయి మాటలు చెప్పారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కూడా చేయని సీఎం, మరోసారి గెలిస్తే చేస్తాను అని చెప్పడం విడ్డూరంగానే అనిపిస్తున్నాయి.
రహస్యంగా రుషికొండ రిసార్ట్ ప్రారంభం - ప్రభుత్వం నుంచి కొద్దిమందికే ఆహ్వానాలు
పూటకో మాట మారుస్తూ వచ్చారు.. ఎట్టకేలకు రుషికొండ నిర్మాణాలపై క్లారిటీ..!
విశాఖపై ఎనలేని ప్రేమ చూపిస్తోన్న సర్కార్.. తెరపైకి మెట్రో కథ.. ఇన్నాళ్లూ ఏం చేశారో..!