CM Jagan Exercise for YSRCP Seventh List: ఇప్పటికే 6 జాబితాలు విడుదల చేసి 30మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన వైఎస్సార్సీపీ ఏడో జాబితా సిద్దం చేస్తోంది. రాష్ట్రంలో మరిన్ని లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. త్వరలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అసంతృప్త నేతలను సైతం సీఎం జగన్ పిలిపించుకొని వారితో చర్చలు జరుపుతున్నారు.
మార్పులపై ఎమ్మెల్యేలతో మంతనాలు: సీఎం జగన్ పిలుపు మేరకు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సీంవోకు వచ్చారు. సీఎం పిలుపు మేరకు బాపట్ల ఎంపీ నందిగం సురేష్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సీఎంవో కు వచ్చారు. సీఎంవోలో సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి ధనుంజయరెడ్డి ను కలిశారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు. నియోజకవర్గ ఇన్ చార్జీల మార్పుపై నేతలు చర్చించారు. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ముస్లిం అభ్యర్థిని నిలపాలని నిర్ణయించిన సీఎం, జగన్, అభ్యర్థి ఎంపికపైనా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని చర్చిస్తున్నారు. ఎమ్మెల్సీ ఇసాక్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మంత్రి అంజాద్ బాష అభ్యర్ధిత్వాలను పరిశీలిస్తున్నారు. మార్పులు చేర్పులతో మరికొద్ది రోజుల్లో ఏడో జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి.
జగన్ పిలుపుతో నేతల గుండెల్లో పిడుగు - ఈ సారి కరివేపాకులు ఎవరో?
రాజ్యసభ ఎన్నికల కోసం బుజ్జగింపులు: మరోవైపు 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు చింపేసిన సీఎం జగన్ వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఆత్మరక్షణలో పడ్డారు. ఇప్పటికే కొందరు జగన్ కు గుడ్ బై చెప్పి బయటకు వెళ్లిపోగా, మరికొందరు సిద్దమవుతున్నారు. త్వరలో రాజ్యసభ ఎన్నికలు వస్తుండటం ఎమ్మెల్యేలందరూ ఒటు వేస్తేనే వైకాపా అభ్యర్థులు నెగ్గే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యేలు హ్యాండివ్వకుండా బుజ్జగింపులకు దిగారు. రోజుకు కొంత మంది చొప్పున పిలిపించి బుజ్జగిస్తున్నారు. ఈనేపథ్యంలో కర్నూలు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు.
టీడీపీ,జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా అంటూ వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారాలుః టీడీపీ నేత వర్లరామయ్య
ప్రకాశం జిల్లాలో అలకపాన్పు: అలక ప్రకాశం జిల్లాలో రాజకీయం రసకందాయంలో పడింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యత తగ్గించిన సీఎం జగన్, పొమ్మనకుండా పొగపెడుతుడటంతో ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనని పార్టీలో చర్చ సాగుతోంది. ఈ సారి ఒంగోలు ఎంపీ సీటును సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వకూడదని సీఎం జగన్ నిర్ణయించగా, మాగుంటకే ఎంపీ సీటు ఇవ్వాలని బాలినేని పట్టుపట్టారు. మాగుంట కాకపోయినా తాను సూచించిన వారికి ఎంపీ సీటు ఇవ్వాలని బాలినేని కోరినా సీఎం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజులుగా తాడేపల్లి వైపు కన్నెత్తి చూడటం లేదు. అదే సమయంలో సీఎంకు సన్నిహితుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఒంగోలు అభ్యర్థిగా సీఎం నిర్ణయించడంతో ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీలో అగ్గి రాజేసినట్టైంది.
రసవత్తరంగా ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ రాజకీయం-బాలినేనికి అధిష్టానం షాక్?