CM Jagan Assurances to Joint West Godavari District: ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో, ముఖ్యమంత్రిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సందర్భాల్లోనూ జగన్ జిల్లాపై హామీల వర్షం కురిపించారు. ఒకటి రెండూ కాదు ఏకంగా రూ.4 వేల కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు స్వయంగా శ్రీకారం చుట్టారు. వీటిలో ఒక్క నరసాపురం నియోజకవర్గంలోనే దాదాపు 3 వేల 300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం నరసాపురం చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. ఇదంతా నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు జరుగుతున్న గొప్ప ప్రయత్నమని సీఎం జగన్ ఆర్భాటంగా చెప్పుకున్నా ఇప్పటికీ వాటికి అతీగతీ లేకుండా పోయింది.
ఆక్వా విశ్వవిద్యాలయం పేరుతో గొప్పలు: ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, యువతకు ఆక్వాకల్చర్ పరిజ్ఞానం ఉంటే మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతోనే ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ అప్పట్లో చాలా గొప్పగా చెప్పారు. దీని నిర్మాణం కోసం లిఖితపూడి, సరిపల్లి గ్రామాల మధ్య 40 ఎకరాలు కేటాయించారు. రూ.332 కోట్లతో నిర్మాణం చేయాల్సి ఉండగా మొదటి దశలో పరిపాలన భవనం, విద్యార్థుల వసతి గృహాలు, వర్సిటీ నిర్మాణానికి రూ.100కోట్లు మంజూరు చేశారు. ఇప్పటివరకూ కనీసం ఇక్కడ పునాదుల దశ కూడా దాటలేదు. ఆక్వా విశ్వవిద్యాలయం నిర్మాణం అటకెక్కడంతో ఇందులో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రస్తుతం లక్ష్మణేశ్వరంలోని తుపాను రక్షిత భవనంలో తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి దాపరించింది.
వీళ్లందరూ మంచోళ్లైతే - ఇన్నాళ్లు జనాన్ని ముంచిందేవరో చెప్తారా జగన్ గారు! - YSRCP MLA Candidates
ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుపై ప్రగల్భాలు: నరసాపురం పరిధి బియ్యపు తిప్పలో 150 ఎకరాల విస్తీర్ణంలో 429 కోట్ల 43 లక్షల రూపాయల అంచనాతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కోసం రెండేళ్ల క్రితం సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. భారీ ఫ్లాట్ ఫామ్స్, వేలం హాళ్లు, బోటు పార్కింగ్, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని అట్టహాసంగా ప్రకటించారు. ఇప్పటికీ ఇక్కడ ఒక్క ఇటుక కూడా పడలేదు. నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడంతో పనుల్లో పురోగతి లేదు. ఈ ఫిషింగ్ హార్బర్ పూర్తయితే అత్యంత సామర్థ్యం కలిగిన మోటారు బోట్లతో సముద్రంలో ఎక్కువ దూరం వెళ్లి వేట సాగించేందుకు వీలుండటంతో పాటు నరసాపురం, మొగల్తూరు మండలాల్లో దాదాపు 6 వేల మందికి లబ్ధి చేకూరేది.
పట్టాలెక్కలెక్కని వశిష్ఠవారధి నిర్మాణం: నరసాపురం, మొగల్తూరు మండలాలను కోనసీమతో అనుసంధాన చేసేందుకు 26 కోట్ల రూపాయల అంచనాతో వశిష్ఠవారధి నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేశారు. గోదావరి నదిపై రాజులలంక సమీపంలో వంతెనతోపాటు రహదారులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ వారధి నిర్మాణం పూర్తయితే చించినాడ వంతెన మీదుగా లేదా నరసాపురం నుంచి పంటు మీదుగా వెళ్లకుండా సరాసరి సఖినేటిపల్లి, మల్కిపురం, రాజోలు వెళ్లేందుకు తేలికవుతుంది. జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో రెండేళ్లు గడిచినా ఈ వారధి నిర్మాణం పట్టాలెక్కలేదు. గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో టెండర్ల దశలోనే నిలిచిపోయింది.
ప్రశ్నార్థకంగా వియర్ ఛానల్ ఏర్పాటు: మొగల్తూరు మండలంలోని చివరి ప్రాంతాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రూ.24 కోట్ల వ్యయంతో వియర్ ఛానల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మొగల్తూరు-పేరుపాలెం మధ్య ఏర్పాటు చేసే ఈ కాలువతో దాదాపు 2 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఈ పనులు ఇప్పటివరకు మొదలుకాలేదు.
శిథిలావస్థలో స్లూయిజ్‌లు: నరసాపురం పరిధిలో స్లూయిజ్‌లు శిథిలావస్థకు చేరడంతో వరదల సమయంలో పొలాలు ముంపునకు గురై వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోంది. దీని నివారణకు 9కోట్ల అంచనా వ్యయంతో నియోజకవర్గంలో కాజ, ఈస్ట్ కుక్కులేరు, ముస్కేపాలెం ప్రాంతాల్లో స్లూయిజ్ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులకు మూడుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క గుత్తేదారు ముందుకు రాకపోవడంతో స్లూయిజ్‌ల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది.
రెగ్యులేటర్, వంతెన లాక్ నిర్మాణం పనులు: సముద్రపు నీరు కొల్లేరులో చేరకుండా నిరోధించి 5వ కాంటూరు వరకు మంచి నీరు నిల్వచేయడానికి ఉప్పుటేరుపై మోళ్లపర్రు పరిధిలో 188 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో రెగ్యులేటర్, వంతెన లాక్ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఏళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మూడుసార్లు టెండర్లు పిలిచినా ఒక్క గుత్తేదారు ముందుకు రాలేదు.
విద్యుత్తు ఉపకేంద్రం: రుస్తుంబాదలో 220/132/33కేవీల సామర్థ్యం ఉన్న విద్యుత్తు ఉపకేంద్రం పనులు స్థల సేకరణ దశలోనే ఆగిపోయాయి. 26 ఎకరాలకుగాను ఆరున్నర ఎకరాలే సేకరించడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. నరసాపురంలో ఉపకేంద్రం నుంచి సరఫరాలో హెచ్చుతగ్గులు, కోతలతో ప్రజలతో పాటు వరి, ఆక్వా రైతులు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఉపకేంద్రం పూర్తయితే నాలుగు మండలాలతో పాటు ఆక్వా వర్శిటీకి ఇక్కడి నుంచే విద్యుత్తు సరఫరా చేసే అవకాశం ఉండేది.
శంకుస్థాపనకే పరిమితమైన భూగర్భ డ్రైనేజీ నిర్మాణం: నరసాపురంలో తేలికపాటి వర్షానికే డ్రెయినేజీలు పొంగి ఇళ్లలోకి నీరు వస్తుంది. దీంతో పట్టణంలోని 31 వార్డుల ప్రజలు వర్షాకాలంలో నరకం చూస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సీఎం 85కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ఆ పనులకు ప్రతిపాదనలు కూడా సిద్ధం కాలేదు.
వైద్య కళాశాల నిర్మాణం పనులు: పాలకొల్లు పరిధిలోని దగ్గులూరులో వైద్య కళాశాల నిర్మాణానికి 2021లో పరిపాలన అనుమతులు రాగా 61 ఎకరాల భూమిని సేకరించారు. నిధుల సమస్యతో పునాదుల్లో మట్టి పోసేందుకే రెండేళ్లు పట్టింది. ప్రస్తుతం పునాదుల్లో కాంక్రీటు నింపుతున్నారు. రూ.475 కోట్ల అంచనా వ్యయం కాగా ఇప్పటికి రూ.30 కోట్ల పనులే పూర్తయ్యాయి. వైద్య కళాశాలలో ప్రవేశాలు, తరగతులు నిర్వహించాలంటే కళాశాలకు అనుబంధంగా 300 పడకల ఆసుపత్రి ఉండాలి. జిల్లాలో అంత సామర్థ్యం ఉన్న ఆసుపత్రులు లేవు. ఫలితంగా వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసి, పడకలు అనుసంధానం చేసి, ప్రవేశాలు, తరగతులు నిర్వహించాలంటే ఏళ్లు పడుతుందని విమర్శలు వస్తున్నాయి.
అతీగతీ లేకుండా పోలవరం కుడికాలువపై ఎత్తిపోతల పథకం: ఏలూరు జిల్లా పెదవేగి మండలం జగన్నాథపురంలో 68 కోట్ల 85 లక్షలు అంచనాతో పోలవరం కుడికాలువపై ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మార్చి 25 నాటికి ఏడాది పూర్తైనా ఇప్పటికీ స్థల సేకరణ చేయలేదు. టెండర్ల ప్రక్రియ ఊసేలేదు. దెందులూరు నియోజకవర్గంలోని దాదాపు 5 నుంచి 10 వేల ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగు నీరందుతుంది. ఏటా శివారు ప్రాంతాలకు నీరందక పొలాలు నెర్రెలు తీస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టినా ఇప్పటికీ అతీగతీ లేదు. విజయరాయిలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఇప్పుడా ప్రాంతంలో శిలాఫలకం, పిచ్చిమొక్కలు తప్ప నిర్మాణ ఊసేలేదు.
చింతలపూడి ఎత్తిపోతల పథకం: అధికారంలోకి రాగానే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని 2019 ఎన్నికలకు ముందు నూజివీడు ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ఈ పథకంతో ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల ప్రజలకు మేలు జరిగేది. టీడీపీ పాలనలో పరుగులు పెట్టిన ప్రాజెక్టు పనులు వైసీపీ హయాంలో పూర్తిచేసిన పాపానపోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గుత్తేదారులకు 143కోట్లు, రైతులకు 50 కోట్ల రూపాయల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు జగన్ ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం కూడా అమలుకు నోచుకోకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాటల ముఖ్యమంత్రే తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని విమర్శిస్తున్నారు.