CBN review ON financial condition : వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవస్థలను ఏవిధంగా విధ్వంసం చేసిందో వివరిస్తూ సీఎం చంద్రబాబు వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్‌రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం... అదే వరుసలో ఈనెల 18న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అప్పులపై సమగ్ర నివేదిక ప్రజల ముందు ఉంచనున్నారు. సచివాలయంలో ఆర్థిక అంశాలు, బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ముఖ్యమంత్రి ప్రధానంగా ఆరా తీశారు. మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించేందుకు ఆర్డినెన్సు జారీపైనా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన ఇబ్బడిముబ్బడి రుణాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్రానికి ఉన్న అప్పులు, ఆర్థిక అంశాలపై ఈనెల 18న ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. సచివాలయంలో అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు ఆర్థిక అంశాలు- రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. రాష్ట్రానికి ఏమేరకు అప్పులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. 2019 -24 మధ్య కాలంలో ప్రభుత్వం చేసిన రుణాలు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తో పాటు కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలపై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకూ అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా 14.49 లక్షల రూపాయల మేర ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు పెండింగ్ బిల్లులు ఏమేరకు ఉన్నాయనే అంశంపైనా చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల నుంచి ఇంకా వివరాలు అందాల్సి ఉందని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.
రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూ, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ నిధుల కేటాయింపులపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఇటీవల దిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా కోరిన సీఎం నిరంతరం కేంద్ర మంత్రిత్వశాఖలతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రాష్ట్రం ఏవిధంగా దెబ్బతిందో ప్రజలకు సవివరంగా తెలియజేసేలా శ్వేతపత్రం రూపొందించాలని ఆర్థికశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించేలా ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలిసింది. దీనిపై కేబినెట్ సమావేశంలోనూ ప్రభుత్వం తీర్మానం చేయనుంది.
పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష - ప్రాజె్క్టు పరిస్థితిపై ఆరా.. - Chandrababu meeting in Secretariat