CM Chandrababu on Gudlavalleru Hidden Camera Issue : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు కళాశాలఘటనపై విచారణ కొనసాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆడపిల్లల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రమంతా ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం దారుణమని, ఆడబిడ్డలపై దుష్ప్రచారం చేయడం మంచిది కాదని వెల్లడించారు. దిల్లీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటున్నామని, అనుమానం ఉన్నవారిని ఫోన్లు, కంప్యూటర్లు తనిఖీ చేస్తామని వెల్లడించారు.
గుడ్లవల్లేరు ఘటనపై ఆధారాలుంటే పోలీసులకు ఇవ్వాలని అన్నారు. అన్ని హాస్టళ్లలో ఇలాగే జరుగుతోందని వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని, ఆడపిల్లలపై దుష్ప్రచారం పక్కా కుట్రే అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 వీడియోలు అంటూ ఏదేదో చెబుతున్నారని తెలిపారు. కలుషితాహార ఘటనల్లో వైసీపీ వారి కుట్రను కొట్టిపారేయలేయమని సీఎం అన్నారు. బాబాయ్‌నే చంపేసి నాపై అభాండాలు వేశారన్న ఆయన, రాజకీయాల్లో ఉన్న రౌడీలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఆడపిల్లలకు ఏదైనా జరిగితే అదే మీకు చివరిరోజు అవుతుందని హెచ్చరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఎవరి వద్ద ఎలాంటి వీడియోలు లేవు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుడ్లవల్లేరు కళాశాల వ్యవహారంలో ఎలాంటి హిడెన్ కెమెరాలు, వీడియోలు లేవని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. బ్లూ మీడియా కావాలనే ఈ అంశంపై తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో బాధ్యులైన విద్యార్థులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విద్యార్థుల చరవాణులన్నీ తనిఖీ చేశామని అన్నారు. ఎవరి వద్ద ఎలాంటి వీడియోలు లేవని తేల్చి చెప్పారు.
త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటాం : వైఎస్సార్సీపీ నేతల కుంభ కోణాలు, ముంబై సినీ నటి జత్వాని కేసుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బ్లూ మీడియా దీనిని తెరపైకి తీసుకొచ్చారని మంత్రి లోకేశ్ చెప్పారు. బ్లూ మీడియా ప్రతినిధులు కూడా భూకుంభకోణాల్లో ఉన్నారని, వారి పాత్రలను త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు. వాళ్లల తాము పారిపోమని తెలిపారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిల తాను ఇద్దరు చెల్లలు, తల్లిని బయటకు పంపలేదని ఎద్దేవా చేశారు. ట్రిపుల్ ఐటీలో జరిగిన ఘటనపై పూర్తి స్థాయి నివేదక వచ్చిందని తెలిపారు. త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖలో త్వరలోనే నూతన మార్పులు తెస్తామని అన్నారు.
గుడ్లవల్లేరు రహస్య కెమెరాల ఘటన - దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశం - Hidden Cameras in Girls Hostel