Clash Between YSRCP Leaders about Defeat of 2024 Elections: 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ స్థానాలతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా విర్రవీగారు. మనల్ని ఆపేది ఎవరూ లేరంటూ రెచ్చిపోయారు. రాష్ట్రమంతా నేతలు ఒక్కటై అందినకాడికి దోచుకున్నారు. కానీ 2024 ఎన్నికల్లో డామిట్ కథ అడ్డం తిరిగింది. వైఎస్సార్సీపీ ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడింది. ఇలాంటి పరిస్థితిలో సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో వైఎస్సార్సీపీ నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.
‘అంతా మీరే చేశారు’ ఇది ఒక సినిమాలోని పాపులర్ డైలాగు. ఇప్పుడదే డైలాగును వైఎస్సార్సీపీలో తాజా మాజీలు ఒకరిపై ఒకరు గట్టిగానే ప్రయోగించుకున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బొక్క బోర్లా పడటమే కాకుండా కొన్ని జిల్లాల్లో కూటమి సునామీలో పూర్తిగా కొట్టుకుపోయింది. అలాంటి జిల్లాల్లో నెల్లూరు ఒకటి. ఇక్కడ పార్టీ అంతలా భ్రష్టు పట్టిపోవడంపై నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద గురువారం వైఎస్సార్సీపీ నేతల మధ్య చర్చ నడిచింది. జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్‌లో కలిసేందుకు జగన్ లోపలికి వెళ్లినప్పుడు బయట వేచి ఉన్న తాజా మాజీ మంత్రి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది.
వెళ్లిపోతున్నారా ! - నన్నొదిలి పోతున్నారా !! - YS Jagan on Leaders Migration
మాజీ మంత్రి: మీ సామాజికవర్గం వారే మా జిల్లాను నాశనం చేశారు.
మాజీ ఎమ్మెల్యే: అంతా మీ వల్లే. మీరే జిల్లాలో పార్టీని సర్వనాశనం చేశారు.
మాజీ మంత్రి: నాదేం లేదు, అంతా మీ వాళ్ల వల్లే...
మాజీ ఎమ్మెల్యే: అసలు ఆమెను (ఎన్నికల ముందు వైకాపాను వీడిన మహిళా నాయకురాలిని ఉద్దేశించి) రాజమాత అని మీరెందుకు తిట్టారు? అక్కడి నుంచే పార్టీ నాశనం మొదలైంది.
మాజీ మంత్రి: రాజమాత అంటే అదేమీ తిట్టు కాదు కదా. మీ వాళ్ల వల్లే పార్టీకి ఈ పరిస్థితి.
అంతలో జగన్ భద్రతా సిబ్బందిలో ఒకరు కలగజేసుకుంటూ..‘ఏమైనా... సార్ (మాజీ మంత్రిని ఉద్దేశించి) మీ వల్ల ఇబ్బంది మొదలైంది. అందరూ కలిసి పార్టీని ముంచినారు’ అని వ్యాఖ్యానించారు.
మొత్తానికి వైఎస్సార్సీపీ నేతలలో విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలువురి తీరు నచ్చక అనేకమంది ఆ పార్టీని వీడుతున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా నేతల భేటీలో ఇటీవలే స్పందించారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకునేవారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం, విలువలు, నైతికత అనేవి వారికి ఉండాలని అన్నట్లు తెలుస్తోంది. వెళ్లేవారు వెళ్తారని, బలంగా నిలబడగలిగేవారే తనతో ఉంటారని చెప్పినట్లు సమాచారం. పార్టీలో తాను, అమ్మ ఇద్దరమే మొదలై ఇంత దూరం వచ్చామని, ఇప్పుడూ మళ్లీ మొదటి నుంచి ప్రారంభిద్దామని, ఇందుకు ఇబ్బందేమీ లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.