Andhra Pradesh Election Schedule : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముహూర్తం ఖారారైంది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీలో 175 అసెంబ్లీ, 25ఎంపీ స్థానాలకు షెడ్యూల్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది.
CEC Live 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన- ఈసీ మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం
మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా, 25 పార్లమెంట్(లోక్‌సభ) స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈ నెల రాష్ట్రంలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు కాగా, 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. దేశ వ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా మే 13న నాలుగో విడతలో భాగంగా ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగనుంది.
'కోడ్' కూయగానే ఇవి అమలు చేయాల్సిందే'
రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదే విధంగా 4 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్‌డ్ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల ఓటర్లు ఉండగా, వీరిలో 2 కోట్ల మంది పురుషులు, 2.07 కోట్ల మంది మహిళా ఓటర్లు, 3,482 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 67,434 మంది సర్వీస్ ఓటర్లు, 7,603 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలు ఉండగా, సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు 887 ఓటర్లు ఉన్నారు. 179 మహిళలతో నిర్వహించే పోలింగ్ స్టేషన్లు, మరో 50 యువతతో నిర్వహించే పోలింగ్ స్టేషన్లు, మొత్తం 555 ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికల బడ్జెట్ ఎంతో తెలుసా? ఎలక్షన్లకు అయ్యే ఖర్చు తెలిస్తే షాక్!
సీఈవో ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ ఇప్పటివరకు రూ.164 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పేపర్, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలని, క్రిమినల్ కేసులు ఉంటే ఆయా పార్టీల వెబ్‌సైట్‌లో వివరాలు ఉంచాలని సీఈవో స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత పెంచుతామన్న సీఈవో ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఇప్పటికే పరీక్షించామని వివరించారు.
రాష్ట్రంలో 46 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలున్నాయని సీఈవో తెలిపారు. దరఖాస్తు చేసిన వారికి ఈ నెలాఖరులోగా ఓటరు కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని, ఓటరు కార్డు లేకుంటే 12 గుర్తింపు కార్డులను చూపించవచ్చు అని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, 85 ఏళ్లు దాటిన వారికి ఇంటివద్దే ఓటు వేసే అవకాశం ఉందని సీఈవో తెలిపారు.
ఏడు దశల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు- జూన్ 4న కౌంటింగ్- పూర్తి షెడ్యూల్ ఇదే