BRS Prashanth Reddy Fires On Congress : బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. భీంగల్ మండలం బెజ్జోరలో కాంగ్రెస్ నేతల అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆయన కాంగ్రెస్ నేతల వైఖరిపై అగ్రహం వ్యక్తం చేశారు. ఒక బాధ్యత గల ఒక పౌరుడిగా కళ్లముందు జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.
ప్రశ్నించిన వారిపై దాడులు, హత్యాయత్నాలేనా ప్రజాపాలన అంటే అని ప్రశ్నించారు. రోజురోజుకు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పెరుగుతున్నాయని ప్రశాంత్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అక్రమ సంపాదనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. అక్రమ రవాణాను అడ్డుకుంటున్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై దాడులు, హత్యాయత్నాలకు తెగబడడం దుర్మార్గపు చర్య అన్నారు.
చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం : ఇసుక రవాణా జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం హత్యాయత్నం నేరం రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. అవినీకి, అక్రమాలు, అరాచకాలు చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించి వెంటాడి ప్రజాకోర్టులో నిలబెడుతామని మాజీ మంత్రి హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిపై గవర్నర్‌కు ఫిర్యాదు : కాగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, నిరుద్యోగులపైన దాడులకు పాల్పడుతుందని మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల మీద నిర్బంధం, అణచివేత, అరెస్ట్‌లు, అక్రమ కేసులతో తెలంగాణ ఉద్యమం నాటి తరహాలో భయానక వాతావారణం పునరావృతం చేస్తున్నారని చెప్పినట్లు పేర్కొన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్‌కు సంబంధించి వాళ్లిచ్చిన ప్రకటనలు, హామీలు, గ్రూప్స్ పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చి పట్టించుకోవటం లేదని వివరించారు.
'పార్టీ ఫిరాయింపులపై దూకుడు పెంచిన బీఆర్ఎస్ - నేడు గవర్నర్ ఫిర్యాదు' - BRS Leaders To Meet Governor