BRS Medak MP Candidate Venkatarami reddy Nomination : పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ మెదక్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్‌కు ఆయన తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయన వెంట నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.
అంతక ముందు నామినేషన్ పాత్రలను సిద్దిపేట జిల్లా కునాయిపల్లిలోని వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గులాబీ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో రెండు సెట్ల నామినేషన్ వేశానని వెంకట్రామిరెడ్డి తెలిపారు. 11 సంవత్సరాల ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్‌గా పనిచేసిన అపార అనుభవం ఉందని పేర్కొన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు ఉన్నారని, వారి గుణగణాలు, అర్హతలను ఏంటో చూసి ఓటేయాలని కోరారు.
కాంగ్రెస్ హామీలుకాని హామీలతో మోసం : గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వెంకట్రామిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలోనే ఆ పార్టీ రంగు బయట పడిందని దుయ్యబట్టారు. బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. దుబ్బాక ప్రజలకు నాగలి, ఎద్దులు నిరుద్యోగులకు రెండువేలు డబ్బులు ఇస్తానని మోసం చేశారని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్ రావును 54,000 ఓట్లతో అక్కడి ప్రజలు ఓడించారని ఎద్దేవా చేశారు.
దుబ్బాకలో చెల్లని నాణెం మెదక్ పార్లమెంట్లలో ఏ విధంగా చెల్లుతుందని వెంకట్రామిరెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను ముందుకు వచ్చానని చెప్పారు. నిరుపేద కుటుంబాల కోసం సొంతంగా ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నానని, గెలిచిన తొమ్మిది నెలలోపు ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మించి ప్రతి పేద కుటుంబానికి ఒక్క రూపాయితో శుభకార్యాలకు సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆదరణతో ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనను విశ్వసించి నమ్మి ఓటేయాలని కోరారు.
'11 సంవత్సరాలు ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. నాకు ప్రజల ఆదరణ ఉంది. ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఏ కలెక్టర్‌కు దక్కని గౌరవం నాకు దక్కినందుకు మెదక్ పార్లమెంట్ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ప్రజలు ఆదరణ ఉన్నందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు పార్టీ టికెట్ ఇవ్వడం, వారి ఆశీస్సులతో ఇవాళ నామినేషన్ వేశాను.'- వెంకట్రామిరెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి