KTR Slams BJP and Congress : బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు యత్నిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమైతే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రంగా మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆ విషయంలో బీజేపీతో పోరాడే సత్తా కాంగ్రెస్‌కు లేదన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ చాలా ప్రయత్నాలు చేశారని తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో తెలంగాణ గళం వినిపించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులను లోక్‌సభకు పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలని, అందుకు గులాబీ పార్టీకి ఓటేయాలి కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీని పది సీట్ల వరకు గెలిపిస్తే ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితికి గులాబీ పార్టీ వస్తుందని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ యువ నాయకుల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ అభ్యర్థులైన రాగిడి లక్ష్మారెడ్డిని, నివేదితలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
"ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాన్ని యువత గ్రహించాలి. యువ వికాసం పేరుతో హామీలు ఇచ్చి అమలు చేయలేదు. దుస్థితిలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు, నీటి ట్యాంకర్లు, నీటి సమస్యలే దర్శనమిస్తున్నాయి." - కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
KTR Fires on BJP : గ్యారెంటీలు అమలు చేయకుండా మెట్రో పిల్లర్లకు వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేశామని బ్యానర్లు పెట్టడం సిగ్గుచేటని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా,బుల్లెట్ రైళ్లు ప్రారంభించకుండా కేవలం దేవాలయాలు నిర్మించామని ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 1000 ఏళ్లు ప్రజలు గుర్తుంచుకునేలా యాదాద్రి దేవాలయాన్ని నిర్మించారని తెలిపారు. బీజేపీ మళ్లీ గెలిస్తే, పెట్రోల్ రేటు రూ.400 దాటడం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్లో యువనేతలకి గొప్ప అవకాశం ఉంటుందని చెప్పారు.
"హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ యత్నిస్తోంది.హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమైతే అభివృద్ధి ఆగిపోతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోదీ చాలా ప్రయత్నాలు చేశారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలి. మీరు బీఆర్ఎస్కు ఓట్లు వేస్తే ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది. మోదీతో పోరాటం రాహుల్ గాంధీ వల్ల కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం యువ వికాసం పేరుతో హామీలు ఇచ్చి విద్యార్థులను మోసం చేసింది." -కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
మాకు 12 సీట్లు ఇస్తే, గుంపు మేస్త్రీ ఇంటికి వెళ్లడం ఖాయం : కేటీఆర్ - lok sabha elections 2024