Jagadish Reddy On Power Purchase : రాష్ట్రంలో గత సర్కార్ జరిపిన విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కమిషన్‌పై మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వాలకు విచారణ చేసే అధికారం ఉండదని అన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని, ఆయన తీరుతో ప్రజల్లో తప్పుడు సమాచారం వెళ్లేందుకు ఆస్కారం ఉందని మండిపడ్డారు. ఆయన నిజాయితీగా ఉంటే కమిషన్ బాధ్యత నుంచి వైదొలగాలని సూచించారు.
Jagadish Reddy Clarity on Yadadri Power Plant : జస్టిస్ నరసింహారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఈ నెల 15 వరకు నోటీసులో గడువు ఇచ్చి 11న జరిగిన మీడియా సమావేశంలో ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారని అలా చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆయన ప్రవర్తనతో ప్రజల్లో తప్పుడు సమాచారం వెళ్లేందుకు ఆస్కారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణంలోని ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంలో న్యాయ విచారణ పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగంలో మెుదటిసారిగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పే విషయంలో అన్ని రకాల చట్టాలను, నిబంధనలు పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర అనుమతులను సాధిస్తూ ముందుకు వెళ్లామని తెలిపారు.
"విద్యుత్ కొనుగోళ్ల అంశంపై మేము అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చాం. కమిషన్ పాత్రపైన కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతోనే ఒప్పందం చేసుకున్నాం. కమిషన్ ఏర్పాటు కుట్రపూరితంగా జరిగింది. ఏమైనా అవినీతి జరిగితే నిజానిజాలు బయటపెట్టాలి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నాయి. మేం మాత్రం 3.90 పైసలకు విద్యుత్ తీసుకున్నాం." - జగదీశ్‌రెడ్డి, మాజీ మంత్రి
కమిషన్ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదు : జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పాత్రపైన మాజీ సీఎం కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారని జగదీశ్‌రెడ్డి తెలిపారు. విచారణ చేసే అర్హత కమిషన్ ఛైర్మన్ కోల్పోయారని కేసీఆర్ రాసిన లేఖను గుర్తు చేశారు. ఇచ్చిన గడువు ప్రకారం సమాధానం ఇద్దామని అనుకున్నామని పేర్కొన్నారు. కానీ విచారణకు ఇచ్చిన గడువు కంటే ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి జస్టిస్ నరసింహా రెడ్డి కాంగ్రెస్, బీజేపీ నేతల అభిప్రాయాలను చెప్పారని విమర్శించారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ఎలా చెబుతారని మండిపడ్డారు. కమిషన్ ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదని వ్యాఖ్యానించారు.