Harish Rao Open Letter To CM Revanth : పేద బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం కేసీఆర్ సహృదయంతో ప్రారంభించిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పరిస్థితి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అగమ్యగోచరం కావడం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరమన్నారు. అసలు పరిషత్ ఉన్నట్లా? లేనట్లా? అన్న ఆందోళన బ్రాహ్మణ సామాజిక వర్గంలో నెలకొందని అన్నారు.
Harish Rao On Brahmin Welfare Funds : బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులు ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు లేఖ రాశారు. కేసీఆర్ హయాంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం ఏటా రూ.100 కోట్లు క్రమం తప్పకుండా కేటాయించారని, వివిధ పథకాల ద్వారా ఎంతో మంది పేద బ్రాహ్మణ కుటుంబాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. భారీగా నిధులు వెచ్చించడంతో పాటు దేశంలోనే తొలిసారిగా విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మించి, బ్రాహ్మణ సంక్షేమం విషయంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని హరీశ్‌రావు వివరించారు.
బ్రాహ్మణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది : కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, దీంతో సంక్షేమ పరిషత్ ద్వారా అమలు చేసే పథకాలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి, ఎంతో మంది పేద బ్రాహ్మణులకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు గతంలో లాగానే నిధులు విడుదల చేయాలని, పాలక వర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.
వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు : విదేశీ విద్య పథకానికి ఎంపికైన 300 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకు సంబంధించిన రూ.30 కోట్లు తక్షణమే విడుదల చేయాలని కోరారు. 2023-24 ఏడాదికి గానూ దరఖాస్తు చేసుకున్న 344 మంది విద్యార్థులకు తక్షణమే ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బెస్ట్ పథకం కింద ఎంపికైన 497 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.16 కోట్లు విడుదల చేయడంతో పాటు 2023-24 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించాలని కోరారు.
పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి : బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు, వేద పాఠశాలల్లోని వేద పండితులకు ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. 75 ఏళ్లు పైబడిన వేద పండితులకు ఇచ్చే రూ.5000 భృతి ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉందని, వెంటనే చెల్లించాలని కోరారు. సూర్యాపేట, ఖమ్మం, మధిరలో నిర్మించ తలపెట్టిన బ్రాహ్మణ సదనాల పనులు ఆగిపోయాయని, వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.
అక్రమ కేసులు బనాయించడమేనా ప్రజాపాలన అంటే? : హరీశ్‌రావు - Harish Rao On Koushik Reddy Issue