BJP National Leaders Election Campaign in Telangana : చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫేక్ వీడియోలు సృష్టించి ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. భువనగిరి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బూర నర్సయ్యకు మద్దతుగా బీజేవైఎమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి పార్టీ సీనియర్ నేత మురళీధర్‌రావు హాజరయ్యారు. జాతీయ రహదారులు, రైల్వేలు అభివృద్ధికి మోదీ గెలుపు మరింత అవసరమని బూర నర్సయ్య అన్నారు. 'విశేష సంపర్క్ అభియాన్'లో భాగంగా మెదక్‌లో జరిగిన మేధావుల ఆత్మీయ సమ్మేళనానికి మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. విదేశాల్లో దేశ ప్రతిష్ఠను మరింత పెరగాలంటే బీజేపీను గెలిపించాలని కోరారు.
జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిర్వహించిన కార్నర్‌మీటింగ్‌లో పాల్గొన్నారు. దేశాన్ని విశ్వగురువుగా మార్చాలంటే కమలం పువ్వు గుర్తుపై ఓటేసి బీజేపీను గెలిపించాలని కోరారు. జోగులాంబ గద్వాలలోని తేరు మైదానంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్రమంత్రి మురుగన్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మోసపూరిత హామీలకు ప్రజలు మరోసారి బలికావద్దని ఆమె కోరారు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని ఆలూరులో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్, ఎమ్మల్యే పైడి రాకేశ్‌రెడ్డితో కలిసి కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును పక్కనపెట్టి బీజేపీపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
"నిజామాబాద్‌లో పనుపుతో వివిధ పదార్థాలు తయారు చేసి, దానికి వాల్యూవ్ అడిషన్ చేసి మనం ఎగుమతులు చేయాలి. జక్రాన్ పల్లిలో తొందరగా ఎయిర్‌పోర్టు కట్టుకోవాలి. ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్వే లైన్ అవుతుంది. నేను మీ అందరికి వాగ్ధానం చేస్తున్న ఇక్కడ కంటైనర్ డ్రై పోర్టు కూడా తీసకుని వస్తాను. ఇలాంటివి అన్ని కూడా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలవుతున్నాయి." - అర్వింద్, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి
మెదక్ లోక్‌సభ పరిధిలోని మనోహరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు రోడ్ షో నిర్వహించారు. అలవికానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధిచెప్పాలని తెలిపారు. ఈనెల 6న నల్గొండలో జరగనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగసభను విజయవంతం చేయాలని ఆ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి కోరారు.