BJP Lanka Dinakar fire on Jairam Ramesh Comments: ఏపీ పునర్విభజన చట్టాన్ని చెల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును తాము సవరించి నిధులు ఇస్తున్నామని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగిందని, పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేయడమే కాకుండా, ఏపీ పునర్విభజన చట్టాన్ని అస్తవ్యస్తంగా మారడానికి వెనుక జైరామ్ రమేష్, చిదంబరం ఉన్నారని ధ్వజమెత్తారు.
కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఏపీకి తాజా బడ్జెట్లో ఇచ్చిన ప్యాకేజీలు చెల్లని చెక్కులే అవుతాయంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై లంకా దినకర్ మండిపడ్డారు. పోలవరం చెల్లని చెక్కు చేద్దామని కాంగ్రెస్ భావిస్తే, ఏడు మండలాలు ఏపీలో కలిపి ఇప్పటి వరకు 15 వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రం ఇచ్చిందని గుర్తుచేశారు. పోలవరం పూర్తి చేసే భాద్యత కేంద్రానిదేనని బడ్జెట్ 2024-25లో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారని అన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు నిధులతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు ఔటర్ రింగ్ రోడ్డు, స్మార్ట్ సిటీ కోసం 3000 కోట్లు నిధులు, భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు విలువ 25 వేల కోట్లు పైమాటేనని అన్నారు. అమరావతి రైల్వే లైన్ కోసం 2,500 కోట్లు ప్రకటన, దాదాపు 50 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించడానికి అడుగులు వేసిందని వివరించారు.
రాష్ట్ర విభజన చట్టం అశాస్త్రీయంగా తయారు చేయడంలో జైరాం రమేష్ పాత్ర ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఇప్పుడు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నప్పటికీ జైరాం రమేష్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం మూడు ప్రాంతాల్లో కారిడార్లు ఏర్పాటు చేస్తే, 2019 - 24 మధ్య వాటిని సరిగ్గా వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. 2024 - 25 బడ్జెట్లో కోపర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. బడ్జెట్ 2024 - 25 విశ్లేషణలో అబద్దాలతో రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం బాగా చేశారన్నారు.
మైనింగ్ అక్రమాల సూత్రదారి - రిటైర్మెంట్ ప్లాన్‌తో వీర'భద్రం' - Mines Department osd Retirement