Purandeswari Comments on Andhra Pradesh Debts: రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులపై వివరాలు ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఓ లేఖ అందజేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలో 11 మంది ప్రతినిధుల బృందం విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమైంది. 13 అంశాలతో కూడిన లేఖను అందజేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఈ వివరాలు తెప్పించాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లో ఉన్న సమయంలోనూ, గుత్తేదారులకు ఓ క్రమపద్ధతిలో కాకుండా ఎన్నికల తర్వాత ఇష్టారీతిన చెల్లింపులు జరిపిందని ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తడిసిమోపడయ్యాయని, వడ్డీ కూడా చెల్లించలేని స్థితికి చేరుకుందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేకపోతోందని, ఉద్యోగుల పింఛన్లు కూడా సక్రమంగా చెల్లించలేని పరిస్థితులను ప్రజలంతా చూశారని తెలిపారు.
మద్యం విక్రయాల ద్వారా భవిష్యత్తులో ఆదాయాన్ని కూడా ఓ అంచనా వేసి, దాన్ని పూచీకత్తుగా చూపించి మరీ ప్రభుత్వం రుణాలు పొందిందని తెలిపారు. ఆర్‌బీఐ జాబితా ప్రకారం తెచ్చిన మొత్తం అప్పుల వివరాలు ప్రకటించాలని, కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు, గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు వెల్లడించాలని తమ లేఖలో కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు తాకట్టుపెట్టి తెచ్చిన రుణాల మొత్తం ఎంత అనేది బహిరంగపరచాలని విజ్ఞప్తి చేశారు. సావనీర్ గ్యారంటీ ఇచ్చి తెచ్చిన రుణాల మొత్తం ఎంత అనేది వెల్లడించాలని అన్నారు. ఎన్నికల అనంతరం గుత్తేదారులకు చెల్లించిన మొత్తాల వివరాలను తెలియజేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ నుంచి, ఆర్ధిక సంస్థల నుంచి తెచ్చిన అప్పులు, ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ, డీఏ బకాయిలు ఎంత అని ప్రశ్నించారు. ఏటా తిరిగి చెల్లించాల్సిన అసలు, వడ్డీ ఎంతెంత అని, పౌరసరఫరాల కార్పొరేషన్, డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు ఎంత అనే వివరాలను సీఎస్ ద్వారా తెప్పించాలని కోరారు.
సంక్షేమ పథకాలకు నిధులు విడుదలలోను రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపించిందని, బటన్ నొక్కిన వాటికి కూడా పాక్షికంగానే చెల్లింపులు జరిపారన్నారు. ఈ ఏడాది సంక్షేమ పథకాలకు ఇంకా ఎంత నిధులు చెల్లించాలో తెలియజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న కేసులు ఎన్ని, కోర్టులు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయకుండా కంటెంప్ట్ కేసులు ఎన్ని అనేది కూడా ప్రకటింపజేయాలని పురందేశ్వరి కోరారు.
కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలుగా అప్పులు తెచ్చారన్న పురందేశ్వరి, పనులు పూర్తి చేసిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కింద వచ్చిన నిధులు దారి మళ్లించారని పురందేశ్వరి అన్నారు. గ్రామాల్లో పనులు చేసిన సర్పంచ్‌లకు కూడా బిల్లులు చెల్లించలేదని, కార్పొరేషన్ల వారీగా తీసుకొచ్చిన అప్పుల వివరాలు వెల్లడించాలని కోరినట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితిపై పూర్తి వివరాలు వస్తే, తదుపరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలో తెలుస్తుందని పేర్కొన్నారు.