BJP Candidate Arvind Election Campaign : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బూత్‌స్థాయిలో కష్టపడితే గెలుపు మనదే అని మోదీ అన్న మాటలను ఆచరణలో పెడుతున్నారు. ప్రతి కార్యకర్త అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారం చేశారు. పదేళ్ల మోదీ సర్కార్ సాధించిన విజయాలు పథకాలను ప్రజలకు వివరించారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాని చేయాలని కోరారు.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి నుంచి సీఎం కుర్చీ లాగేసేందుకు కుట్ర జరుగుతోందని అర్వింద్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిని జైల్లో వేసినా వేస్తామని హెచ్చరించారు. 'మోదీ జీ మెరే బడే భాయ్' అనగానే రేవంత్ రెడ్డిని ఉద్యోగంలోకి పీకేస్తానని రాహుల్‌గాంధీ బెదిరించారని ఆరోపించారు. అందుకే మోదీ, అమిత్ షాల దొంగ వీడియోలు వైరల్ చేయించారని ధ్వజమెత్తారు. రేవంత్ పక్కనే ఉన్న వారు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని విమర్శించారు.
"ఓటుకు నోటు కేసు జులై 14న మధ్యప్రదేశ్ కోర్టు లాస్ట్ డేట్ ఇచ్చింది. మీ సీఎం సీటును పక్కనున్నోళ్లు, రాహుల్ గాంధీ గుంజేస్తారు. నిజామాబాద్‌లో నాపై రేవంత్ మాట్లాడిన తీరు సరైంది కాదు. సీఎం రేవంత్ హుందాగా మాట్లాడు నేను మాట్లాడితే అంతే తట్టుకోలేవు. అబద్దాలు చెప్పడం మాని రైతులకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి. రేవంత్ అబద్దాలు చెబుతూ దేవుళ్ల పేరుతో ప్రమాణం చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నాడు" - అర్వింద్, నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి
Kishan Reddy Election Campaign : భారతదేశాన్ని ఉగ్రవాద అవినీతిరహితంగా మార్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని మెట్టుగూడ, అడ్డగుట్ట డివిజన్లలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో బీజేపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తూ రాబోయే రోజుల్లో మరింత గొప్ప పాలన అందిస్తామని ప్రజలకు వివరిస్తున్నారు.
Etela Rajender Election Campaign : సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశాతిలక్‌తో కలిసి ఈటల రాజేందర్ పద్మశాలిల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. యాంత్రిక రంగం వచ్చిన తర్వాత చేనేత వృత్తి తీవ్రంగా నష్టపోయినా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ద్వారా వారికి అనేక రాయితీలు కల్పించారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేదని, కేంద్రంలోకి వెళ్లి కొట్లాడితే రుపాయి వచ్చే పరిస్థితి కూడా ఉండదని తెలిపారు. ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, కొత్తగా రైతు రుణమాఫీ నాటకాలకు తెరలేపారని విమర్శించారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థితో పాటు కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓట్లు వేయాలని అభ్యర్థించారు.