Balakrishna Wife Vasundhara in Election Campaign: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణకు మద్దతుగా ఆయన సతీమణి వసుంధర ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళా ప్రయాణికులతో ముచ్చటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వారికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో మూడు దఫాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేద ప్రజలకు ఆర్టీసీ సేవలను దూరం చేసిందని నందమూరి వసుంధర మండిపడ్డారు. కూలీలు, విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులే వారికి అనుకూలంగా ఉంటాయని గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలంతా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారన్నారు.
అనంతరం స్థానిక కూరగాయల మార్కెట్లో ఆమె ప్రచారం నిర్వహించి కాయగూరలు, పూలు, పండ్లు కొనుగోలు చేశారు. కొద్దిరోజులు ఇక్కడే ఉంటున్నామని కాయగూరలు అన్నీ ఇక్కడే కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రతి ఏటా ఇక్కడ పండే చింతపండు, బెల్లం తీసుకెళ్తామని, ఇక్కడ ఉన్నటువంటి నాణ్యత, రుచి మరి ఎక్కడా లేదన్నారు. పట్టణ ప్రజలకు అన్నివిధాలా అనుకూలంగా ఉండే విధంగా జిల్లాలో ఎక్కడా లేనట్లు బాలకృష్ణ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఇది ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉందన్న ఆమె సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ వసుంధర ఓట్లు అభ్యర్థించారు.
"వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో మూడు దఫాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేద ప్రజలకు ఆర్టీసీ సేవలను దూరం చేసింది. కూలీలు, విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులే వారికి అనుకూలంగా ఉంటాయి. ఇది గ్రహించిన చంద్రబాబు మహిళలంతా ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చారు. మరోవైపు పట్టణ ప్రజలకు అన్నివిధాలా అనుకూలంగా ఉండే విధంగా జిల్లాలో ఎక్కడా లేనట్లు బాలకృష్ణ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకునివచ్చారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలంటే ఎన్డీయే కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రజలంతా కృషి చేయాలని కోరుతున్నాం." - నందమూరి వసుంధర, బాలకృష్ణ సతీమణి