APCC Chief YS Sharmila Election Campaign: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మూడు రాజధానుల పేరు చెప్పి ఒక్కటి కూడా సీఎం జగన్ పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. బాపట్ల జిల్లా అద్దంకిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆమె వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
పోలవరాన్ని చంద్రబాబు కొంతమేర నిర్మిస్తే జగన్ మాత్రం దాన్ని పూర్తిగా నాశనం చేశారని అన్నారు. సొంత బాబాయిని హత్య చేసిన వాళ్లనే పక్కన పెట్టుకుని ఎంపీ సీట్లు ఇచ్చారని మండిపడ్డారు. దీంతోపాటు మెగా డీఎస్సీ అని చెప్పి దగా చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ల్యాండ్, ఇసుక, మద్యం మాఫియాలు నడుస్తున్నాయని అన్నారు.
పవన్‌కు ఎన్ని కార్లు ఉన్నాయంటే!- వాటి ధరెంతో తెలుసా? - pawan kalyan nomination
పాదయాత్రలో భాగంగా మద్యపాన నిషేధంపై హామీ ఇచ్చిన జగన్ అది చెయ్యకపోగా కల్తీ మద్యాన్ని తయారుచేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధిక ధరలకు అమ్ముతోందని ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకునిరావటం చేతకాక ప్రజల చేతికి చిప్ప మిగిల్చి ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. దీంతోపాటు గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద కొట్టుకుపోయిన రెండు గేట్లు నిర్మించటం ఈ ప్రభుత్వానికి చేతకాలేదని ధ్వజమెత్తారు.
దీంతోపాటు మతతత్వ పార్టీ అయిన బీజేపీని తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఏనాడూ దగ్గరకు రానీయలేదన్న షర్మిల జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని హామీ ఇచ్చిన జగన్ పదేళ్ల నుంచి దగా చేస్తున్నా మోదీని ఎందుకు ప్రశ్నించడంలేదని విమర్శించారు.
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ప్రచారంలో భాగంగా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలోని కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నివాసానికి చేరుకున్నారు. పందిళ్లపల్లి నుంచి వేటపాలెం మీదుగా రోడ్డు షో చేయనున్నారు. చీరాల గడియారస్తంభం కూడలి వద్ద బహిరంగసభలో షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం చీరాల కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ వేయనున్నారు.