APCC Chief YS Sharmila Election Campaign: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆయన సొంత ఇలాకాలోనే ఓడించడానికి ఆయన ఇద్దరు చెల్లెళ్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వివేకా హత్యకేసులో తమకు జగన్ అన్యాయం చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న షర్మిల, సునీత ఆయనపై పోరుకు ప్రత్యక్ష ఎన్నికల ప్రచారానికి దిగుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. షర్మిలకు తోడుగా వివేకా కుమార్తె సునీత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డే లక్ష్యంగా ఇద్దరూ ప్రచారాస్త్రాలు ఎక్కుపెట్టనున్నారు.
కడప పార్లమెంటు పరిధిలోని బద్వేలు నియోజకవర్గం కాశినాయన మండలం అమగంపల్లి నుంచి షర్మిల బస్సుయాత్రను ప్రారంభిస్తారు. షర్మిలతో పాటే సునీత కూడా బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. ఇవాళ కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బీ.కోడూరు, బద్వేలు, అట్లూరు మండలాల్లో షర్మిల బస్సుయాత్ర సాగనుంది. మొదటిరోజే ఆరు మండలాల్లో పర్యటన ఉండేవిధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
6వ తేదీ కడప, 7వ తేదీ మైదుకూరు, 8న కమలాపురం, 10న పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో షర్మిల బస్సుయాత్ర సాగనుంది. 11న జమ్మలమడుగు, 12న ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటన సాగే విధంగా పార్టీ నాయకులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. దాదాపు వారంరోజుల పాటు షర్మిల కడప పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు.
తన చిన్నాన్నను చంపించిన అవినాష్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకనే కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నానని గతంలోనే షర్మిల స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే ఈ బస్సు యాత్రతో వైసీపీను మరింత ఇరుకున పెట్టే విధంగా ఆరోపణలు చేసే వీలుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కడప ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి బరిలో ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఓడించడమే లక్ష్యంగా ఇద్దరు చెల్లెళ్లు బరిలోకి దిగుతున్నారు. అవినాష్ రెడ్డి, జగన్ కుట్రలను ప్రజలకు వివరించి తద్వారా తమ గెలుపునకు దోహదపడాలని ప్రజలకు పిలుపునిచ్చే విధంగా వారు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న షర్మిల బస్సుయాత్రకు పయనమయ్యారు. షర్మిల, సునీత ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జిల్లాలో రాజకీయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జోరుగా కాంగ్రెస్ నేతల ప్రచారం - జగన్ను సాగనంపడమే లక్ష్యంగా ముందడుగు - Congress leaders campaign