AP High Court on YSRCP Office Demolish Petition : వివిధ జిల్లాల్లోని వైఎస్సార్సీపీ కార్యాలయ భవనాల నిర్మాణాలకు అనుమతులు తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిర్మించారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యాలయ భవనాలను నిర్మించుకునేందుకు రాజకీయ పార్టీలకు ప్రత్యేక వెసులుబాటు ఉండదన్నారు. రాజకీయ పార్టీ అనే కారణం చూపుతూ న్యాయస్థానం నుంచి రక్షణ పొందలేరన్నారు.
సామాన్య ప్రజలకు వర్తించే నిబంధనలే రాజకీయ పార్టీలకు వర్తిస్తాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని అధికారులు ప్రస్తుతం ప్రాథమిక ఉత్తర్వులు మాత్రమే జారీ చేశారన్నారు. సమాధానం ఇస్తే వాటిని పరిశీలించి అధికారులు తుది ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. తుది ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పుడు కోర్టును ఆశ్రయించాలన్నారు. అపరిపక్వదశలో వ్యాజ్యాలు దాఖలు చేశారన్నారు. ఈ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదన్నారు.
భవనాలు కూల్చివేస్తే నష్టం జరుగుతుందని, బాధితులుగా మారతామనే కారణాన్ని సాకుగా చూపుతూ న్యాయస్థానం నుంచి సానుకూల ఉత్తర్వులు పొందాలని పిటిషనర్లు చూస్తున్నారన్నారు. ఇలాంటి వైఖరిని ప్రోత్సహించడానికి వీల్లేదన్నారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇస్తే వాటిపై తగిన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. అనుబంధ పిటిషన్లను కొట్టేయాలని కోరారు.
గురువారం జరిగిన విచారణలో ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో అనుబంధ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులిచ్చే వ్యవహారంపై తీర్పును వాయిదా (రిజర్వ్) వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ప్రకటించారు. కూల్చివేతల విషయంలో యథాతథ స్థితి పాటించాలంటూ బుధవారం ఇచ్చిన ఉత్తర్వులు ఈ అనుబంధ పిటిషన్లపై నిర్ణయం వెల్లడించేంత వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమతి పొందకుండా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయ భవనాలను ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా నోటీసులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ వివిధ జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు కొందరు బుధవారం హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు.
గురువారం మరికొన్ని జిల్లాల అధ్యక్షులు వ్యాజ్యాలు వేశారు. వీటన్నింటిపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు పి వీరారెడ్డి, సీవీ మోహన్‌రెడ్డి మరికొంత మంది న్యాయవాదులు వాదనలు వినిపించారు. బిల్డింగ్ ప్లాన్ ఆమోదం కోసం చేసిన దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నిర్ధిష్ట సమయంలో ఆ దరఖాస్తుపై అధికారులు నిర్ణయం తీసుకోకపోతే అనుమతి ఇచ్చినట్లు భావించి నిర్మాణాలను కొనసాగించవచ్చన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణాలు జరిపామన్నారు. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు భవనాలను కూల్చివేయడమే పరిష్కారం కాదన్నారు. ఆయా భవనాలను క్రమబద్ధీకరించ వచ్చన్నారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పార్టీ కార్యాలయాల భవనాలు కూల్చివేతల విషయంలో యథాతథ స్థితిని పాటించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.