Anna Canteens Reopen from August 15th : రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 తేదీన ప్రారంభిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 2.25 లక్షల మంది అన్నార్థుల ఆకలి తీర్చేలా వీటిని మొదలు పెడుతున్నామన్నారు. మొత్తం 203 క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
ఎక్కడా ధర పెంచడం లేదు : గత ప్రభుత్వ హయాంలో అన్నింటినీ గోదాములు, సచివాలయాలుగా, బ్లీచింగ్ నిల్వ కేంద్రాలుగా వాడుకున్నారని నారాయణ విమర్శించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు టెండర్లను పిలిచామన్నారు. గతంలో అక్షయపాత్ర ఫౌండేషన్ రుచికరమైన భోజనం అందించిందని గుర్తు చేశారు. గతంలో మాదిరిగా అదే 5 రూపాయలకు చొభోజనం, టిఫిన్లు అందిస్తామని స్పష్టం చేశారు. ఎక్కడా ధర పెంచడం లేదని, అన్ని అన్న క్యాంటీన్లు ఒకే మోడల్‌లా ఉంటాయని స్పష్టం చేశారు.
100 మందికి డయేరియా సోకింది : రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా వ్యాప్తి చెందుతోందని, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నీరు కలుషితమై 100 మందికి డయేరియా సోకిందని నారాయణ తెలిపారు. పైపులు మరమ్మతులు చేయవం వల్లే కొన్ని ఇబ్బందులు వచ్చాయని, మురికి కాల్వల నిర్వహణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు.
నిధులన్నీ గత ప్రభుత్వం ఖాళీ చేసింది : సిల్ట్ తీసేందుకు 106 పురపాలక సంఘాలకు రూ.50 కోట్లు విడుదల చేసినట్లు నారాయణ చెప్పారు. సిల్ట్ తీయడంతో పాటు, 24 గంటల్లో దానిని తరలించాలని తెలిపారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. మున్సిపల్ శాఖ నిధులన్నీ గత ప్రభుత్వం ఖాళీ చేసిందని ఆరోపించారు. అమృత్ పథకానికి షేర్ ఇవ్వనందు వల్ల కేంద్రం నుంచి నిధులు రాలేదని అన్నారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరు తాగునీటిను కాచుకొని తాగాలని ఆయన సూచించారు. చెత్త పన్ను అంశంపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.