Alliance Govt Focus on YSRCP Anarchies: వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన హింసా రాజకీయాలు, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత 5 ఏళ్ల అరాచకాలు, అక్రమాలు, దాడులు, తప్పుడు కేసులపై వివరాల సేకరిస్తున్నారు. బాధితులనే నిందితులను చేస్తూ పెట్టిన తప్పుడు కేసులు, కారకులపై ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేస్తొంది.
గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థల విధ్వంసం జరిగిందని భావిస్తున్న కూటమి ప్రభుత్వం అందుకు బాధ్యుల పట్ల కఠినంగానే వ్యవహరించాలని యోచిస్తోంది. నిబంధనలు మీరి వైఎస్సార్సీపీతో అంటకాగిన అధికారులపై నిబంధనల ప్రకారమే చర్యలకు కసరత్తు చేస్తోంది. పోలీసు శాఖ సహా అన్ని శాఖల్లో జరిగిన నాటి అధికార దుర్వినియోగంపై ఈమేర వివరాలు సేకరిస్తున్నారు.
పోలవరంపై చంద్రబాబు దూకుడు - శ్వేతపత్రం విడుదలకు సిద్ధం - White Paper on Polavaram Project
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై అణిచివేత, హింసకు పాల్పడిన ఘటనలపై ఆరా తీస్తున్నారు. నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, కాకినాడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, నంద్యాల అబ్దుల్ సలాం, బాపట్ల అమర్నాథ్ గౌడ్, పలమనేరు మిస్బా, కావలి కరుణాకర్ వంటి ఘటనలపై ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటోంది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు ఉండవల్లి నివాసంపై జోగి రమేష్ దాడి యత్నం, నాయకులు, కార్యకర్తలు, వారి ఇళ్లపై జరిగిన దాడులు, వాటి వెనుక ఉన్న శక్తులపై ఆరా తీస్తోంది.
గత 5 ఏళ్లలో హత్యకు గురైన తెలుగుదేశం కార్యకర్తలు, ఆయా ఘటనలపై నమోదైన కేసుల పురోగతిపై నివేదికలు ఒక్కొక్కటిగా ప్రభుత్వ పెద్దలకు అందుతున్నాయి. ఆయా ఘటనలపై నమోదైన కేసులు, వాటి ప్రస్తుత స్థితిగతులపై కూడా ప్రభుత్వ పెద్దలు నివేదికలు కోరారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో అధికార అండతో ప్రైవేటు ఆస్తులు, గనులు, వ్యాపారాలు స్వాధీనం చేసుకున్న వారి జాబితాను శాఖల వారీగా సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ దోపిడీ, ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఎమ్మెల్యేల, ఎంపీల అక్రమాలపై, విడివిడిగా నివేదికలు రూపొందిస్తున్నారు. వీటన్నింటితో పాటు వైఎస్సార్సీపీ పాలనలోని అక్రమాలు, దౌర్జన్యాలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలు ప్రభుత్వం మారడంతో ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం, నాటి ప్రభుత్వ అక్రమాలపై గళం విప్పుతున్నారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో సామన్య ప్రజలు బయటకు వచ్చి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ అక్రమాలపై పలు చోట్ల ఫిర్యాదులు చేస్తున్నారు. వీటన్నింటిపై సైతం విచారణ జరిపి, చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం అయింది. ఒక్కొక్కటిగా అన్ని అక్రమాలను ప్రజలముందు పెట్టి, చట్టబద్దంగానే చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.