MIM Asaduddin Owaisi in Hyderabad Constituency : హైదరాబాద్ కంచుకోటలో మరోసారి ఎమ్ఐఎమ్ అభ్యర్థి అసదుద్దీన్ వైసీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై గెలుపొందారు. ఆమె గట్టి పోటీ ఇచ్చినా హైదరాబాద్ ప్రజలు ఆయనకే జై కొట్టారు. దాదాపు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈ స్థానంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య గట్టి పోటీ ఉండేది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఎంఐఎం, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. అందుకు కారణం బీజేపీ అభ్యర్థి మాధవీ లత. తన ప్రచారంతో హైదరాబాద్ స్థానంపై చర్చలు మొదలయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో వారు అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో మజ్లిస్ కంచుకోటను స్త్రీ శక్తి (మాధవీ లత) బద్ధలుకొట్టి, చరిత్ర తిరగరాస్తుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడిచింది.
1984 నుంచి ఎంఐఎం అడ్డా : హైదరాబాద్ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. అప్పటి నుంచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందగా, 1984 నుంచి ఎంఐఎం గెలుస్తూ వస్తుంది. ఈ లోక్సభ పరిధిలో మలక్పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పురా, బహదూర్పురా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆయన మొదటిసారిగా 2004 ఎన్నికల్లో పోటీ చేసి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఆయనకు హైదరాబాద్ కంచుకోటగా మారింది. ఐదోసారి కూడా ఆయనే ఎన్నికల పోటీలో నిల్చున్నారు.
నామ మాత్రంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ : ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లు అభ్యర్థులను బరిలో నిలిచినా నామమాత్రంగానే ఉన్నట్లు అనిపించింది. పోటీ మాత్రం మజ్లిస్, బీజేపీ మధ్యే నెలకొంది. ఆ 2 పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలతో భాగ్యనగర రాజకీయాలు వేడెక్కాయి. అసదుద్దీన్ ఒవైసీకి ఈసారి ప్రత్యర్థి మాధవీ లత నుంచి బలమైన పోటీ తప్పదని రాజకీయ పరిశీలకులు భావించారు. బీజేపీ నేతలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి వెళ్లడంతో మజ్లిస్ పార్టీని కోటను బద్దలు కొట్టబోతుందా అనే చర్చలు సాగాయి.
అసెంబ్లీ ఎన్నికల అనుభవంతో ముందే ప్రచారం : అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పోటీని ఎదుర్కున్న ఎంఐఎం పార్టీ నేతలు ఫలితాలు వెలువడ్డ వెంటనే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. మరోవైపు ప్రధాని మోదీ మత రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తూ మైనారిటీ ఓట్లు చీలకుండా జాగ్రత్తపడ్డారు. ప్రత్యర్థి మాధవీ లత ఘాటు విమర్శలను ఎదుర్కొంటూ ప్రచారాన్ని సాగించారు. ఏడు ఎంఐఎం అసెంబ్లీ స్థానాల ఎమ్మెల్యేలతో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో హైదరాబాద్ తిరిగి ఎంఐఎం గుప్పిట్లోకే వెళ్లింది. ఇలా ఐదోసారి అసదుద్దీన్ భాగ్యనగర్ బాద్ షా అయ్యారు.