Achchennaidu Letter to AP CS on CM Jagan Helicopters: సీఎం జగన్ కోసం రెండు హెలీకాప్టర్లను అద్దె తీసుకోవాలనే నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాసారు. ఒక్కో హెలీకాప్టర్‌కు నెలకు రూ. 1.92 కోట్లు చొప్పున రెండింటికి రూ. 3.84 కోట్లు ఖర్చు ప్రజాధనం వృథా చేస్తారా అని ప్రశ్నించారు. 2024 సాధారణ ఎన్నికల్లో జగన్ రెడ్డి తన పార్టీ ప్రచారం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందన్నారు. ఎన్నికల నియమావళిని అధికారంలో ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం నిబద్దతతో అమలు పరచాలని సూచించారు.
సీఎం జగన్ 'బాటా రేట్' వ్యూహం - 99 శాతం హామీల వెనక అసలు కథ ఏంటంటే !
ఎన్నికల నియమావళి ప్రకారం పార్టీ ప్రచారం కోసం ఎయిర్ క్రాప్ట్‌లతో సహా ప్రభుత్వ వాహనాలు వాడరాదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు హెలీకాప్టర్‌లను అద్దెకు తీసుకోవాలని జీవోలు జారీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని లేఖలో ప్రస్తావించారు. హెలీకాప్టర్‌లు అద్దెకు తీసుకోవడం రాజకీయ లబ్ది కోసం తప్ప మరొకటి కాదని వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్ కొన్ని వారాల్లో వస్తుండగా ఈ నిర్ణయం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు చెల్లించలేని ప్రభుత్వం హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడం ప్రజాభీష్టానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. హెలీకాప్టర్లను అద్దెకు తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని కోరారు.
సీఎం జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు - ప్రయాణికులకు డొక్కు బస్సులు
సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ ఖర్చుతో రెండు హెలికాప్టర్లను సిద్ధం చేయనున్నట్లు ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ సిఫార్సుతో వీటిని లీజు ప్రాతిపదికన తీసుకునేలా ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని విజయవాడలో ఒకటి, విశాఖలో మరొకటి పెట్టాలని నిర్ణయించారు. వాస్తవానికి ముఖ్యమంత్రి జగన్ పర్యటనలతో పాటు వీవీఐపీల ప్రయాణం కోసం వేర్వేరుగా రెండు హెలికాప్టర్లను తీసుకోవాలని ఏవియేషన్ కార్పొరేషన్ సిఫార్సుల్లో పేర్కొంది. ప్రస్తుతం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని, జగన్ ప్రయాణాలకు అనుకూలంగా లేదని ఏపీ ఏవియేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ నిర్ధారణకు వచ్చింది. దీనికోసం జగన్‌తో పాటు వీవీఐపీల ప్రయాణం కోసమని రెండు హెలికాప్టర్లను లీజుకి తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల్లో మాత్రం రెండు హెలికాప్టర్లను జగన్ ప్రయాణాలకే వినియోగించేలా నిర్ణయం తీసుకున్నారు.
అన్నొస్తుండంటే ఇవన్నీ పక్కా ఉండాల్సిందే - ప్రజల గురించి ఆయనకు అవసరమే లేదు
MP Raghurama Complain about Jagan Helicopters: జగన్ ఎన్నికల వ్యయ నియమావళి ఉల్లంఘించారని నిబంధనలకు విరుద్ధంగా హెలికాప్టర్లను విజయవాడ ఒకటి, విశాఖలో ఒకటి పెట్టాలని నోటిఫికేషన్ విడుదల చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవల ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. 2 హెలికాప్టర్లకు నెలకు 3 కోట్ల 82 లక్షలు రూపాయలు ఖర్చు చేస్తున్నారని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. భద్రత పేరుతో ఎన్నికల ప్రచారానికే జగన్ ఈ రకమైన ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజా ధనంతో హెలికాప్టర్లు ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు.