Graduate MLC By Election Results 2024 : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై విజయం సాధించారు. ఈ ఎన్నికలో పోటీచేసిన బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ కుమార్, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ప్రాధాన్యత ఓట్లు తక్కువగా రావడంతో ఎలిమినేషన్‌కి గురయ్యారు.
ఇవాళ్టి రాత్రి వరకు సాగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం సాధించారు. తీన్మార్ మల్లన్న విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటమిని అంగీకరించారు. సాంకేతికంగా ఓడిన, నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్లు ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఈసీకి బీఆర్ఎస్ కంప్లైంట్ - BRS Rakesh Reddy Allegations
నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ రసవత్తరంగా సాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. దీంతో గురువారం రాత్రి నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొనగా, ఆ పార్టీల తరఫున బరిలో దిగిన అభ్యర్థులు కౌంటింగ్ ప్రక్రియను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ తర్వాత మల్లన్న గెలుపు ఖాయమనే అంచనాలు ఊపందుకున్నాయి. మరికాసేపట్లో విజేత ఎవరనేది స్పష్టం కానుంది.
తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 తొలి ప్రాధాన్యత ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌కు 29,697 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో అభ్యర్థి గెలుపునకు 1,55,095 ఓట్లు కావాలి. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తంగా 3,10,189 ఓట్లు పోల్‌కాగా, 25,824 ఇన్‌వ్యాలిడ్ ఓట్లు నమోదయ్యాయి. మరోవైపు ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్‌పై తప్పుల తడకగా జరుగుతుందంటూ వస్తున్న ఆరోపణలపై ఆర్వో హరిచందన స్పందించారు. కౌంటింగ్ తీరుపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే సిబ్బంది నివృత్తి చేస్తారని ఆర్వో హరిచందన సూచించారు.