Pratidwani: రాష్ట్రం రుణభారం ఎంత? తెచ్చిన అప్పులన్నీ ఏమయ్యాయి? ఒకవైపు ఎడాపెడా అప్పులు మరోవైపు పడకేసిన అభివృద్ధి, ప్రతి నెలా జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపుల మధ్య వైఎస్సార్సీపీ ఐదేళ్ల ఏలుబడిలో ఆర్థికంగా ఏం జరిగింది? కొంతకాలంగా తొలిచి వేస్తున్న ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తవ్వితీసే పనిలో పడింది ప్రజాప్రభుత్వం. మంత్రివర్గం నిర్ణయం మేరకు త్వరలో విడుదల చేయాలని భావిస్తున్న ఆర్థిక అంశాల శ్వేతపత్రంలో ఆ వివరాల వెల్లడికి కసరత్తు మొదలు కానుంది.
మరి అసలు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్లలో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు? వారి లెక్కల ప్రకారమే చూసుకున్నా సంక్షేమానికి ఇచ్చింది పోగా మిగిలిన అప్పుల నిధులన్నీ ఏమయ్యాయి? ప్రభుత్వం మారిన దగ్గర నుంచి వెలుగుచూస్తున్న జగన్ జల్సాలు, అయినవారికి పందేరాలు, కాగ్ భూతద్ధానికి కూడా అందని వేల కోట్ల రూపాయల లెక్కల్లో ఏం జరిగింది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.
పూర్తిస్థాయి బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు - ఈసారైనా వేతనజీవుల ఆశలు నెరవేరనున్నాయా? - Union Budget 2024
అయిదేళ్ల క్రితం జగన్ సీఎం అయ్యేనాటికి ఉన్న అప్పులెన్ని? జగన్ సీఎంగా దిగిపోయే సమయానికి అప్పులు ఎంతకు చేరాయి? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే సమాయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితేంటి? విజయ్‌కుమార్ చెప్పినట్టు ఒక రాష్ట్రానికి ఇంత భారీ అప్పులు ఎలా సాధ్యం? పోనీ ఆ అప్పులతో చేసిన అభివృద్ధి ఆనవాళ్లైనా ఎక్కడైనా కనిపిస్తున్నాయా? అప్పులు చేయడంలోనూ అడ్డదారులు తొక్కిన మాజీ ముఖ్యమంత్రి జగన్. ప్రభుత్వ, కార్పొరేషన్ల ద్వారా రుణాల సేకరణను దాటి ఆస్తులు, ఆదాయాల తాకట్టు డిపాజిట్ల పేరుతో వేల కోట్ల మళ్లింపులకు పాల్పడ్డారు. ఆ ప్రభావం రాష్ట్రంపై ఎలా పడింది?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు ఆర్థిక నిర్వహణపై కాగ్ నివేదిక కూడా గతంలో తీవ్ర స్థాయిలో తప్పు పట్టింది. నాటి ప్రభుత్వ లెక్కలన్నీ మసిపూసి మారేడుకాయ చేశారని, శాసనసభ అనుమతి కూడా లేకుండా వేలకోట్లు ఖర్చు చేశారని ఆక్షేపించింది. ఆ డబ్బులన్నీ ఏమైనట్లు? రాష్ట్రం అప్పులపై ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటివరకు మనకు తెలిసింది గోరంతే. తెలియాల్సింది కొండంత ఉందన్నారు. అంతగా ఐదేళ్లలో జగన్ చేసిన ఆర్థిక విధ్వంసమేంటి? ఏ ఏ విషయాలు ప్రజలందరికీ తప్పక తెలియాలి?
ఆంధ్రాకు ఆర్థిక ఆయువుపట్టుగా అమరావతి- ప్రజా రాజధానిగా పునరుద్ధరణ - AP Capital Amaravati Development
ఇన్ని ప్రతికూలతల మధ్య రాష్ట్ర ఆర్థికరథాన్ని సాఫీగా ముందుకు నడపించడం ఎలా? హామీల అమలు, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ఈ అప్పులభారం విషయంలో కొత్తప్రభుత్వం ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలి? ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులకు ఇప్పుడు ఎవరు బాధ్యులు? ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నెత్తిన ఎంత రుణభారం ఉంది? ఈ భారమంతా ఎవరు మోయాలి? ఈ అప్పులన్నీ ఎలా తీరాలి? ప్రభుత్వం ప్రకటించే శ్వేతపత్రాల ద్వారా గానీ, తర్వాత మంత్రివర్గ ఉపసంఘంమో మరొకటో నియమించడం ద్వారా గత ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై ఎంత వరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? చట్టప్రకారం అందుకు ఉన్న మార్గాలు ఏమిటి అనేవి నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.