Pratidhwani On School Students Issues : సమకాలీన ప్రపంచంలో ఏ సమాజమైనా ముందడుగు వేయాలంటే అక్కడ విద్యావికాసం జరిగి తీరాలి. అందుకే విద్యను దేశప్రగతికి సాధనం అంటారు విద్యారంగ దార్శనికులు. ఈ ముందు చూపుతోనే మన దేశం కూడా 2030 నాటికి అనేక విద్యా లక్ష్యాలను నిర్దేశించుకుంది. కానీ ఇదే సమయంలో కలవరపెడుతున్న అంశం డ్రాపౌట్లు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి. 21శాతానికి పైగా టీనేజీ పిల్లలు, యువత బడులూ, కాలేజీలకు ఎందుకు దూరం అవుతున్నారు? దీనిని మార్చకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి? అంతరాలు లేని విద్య అందరికీ అందాలంటే ఏం చేయాలి?
రాష్ట్రంలో టీనేజీ పిల్లలు, యువతలో 21% పైగా చదువుకు దూరమవుతున్నారంటూ 2024-సామాజిక, ఆర్థిక నివేదిక వెల్లడించింది. అందుకు దారితీస్తున్న పరిస్థితులు ఏంటి? విద్యకు దూరమవుతున్న వారిలో అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్యే అధికం. కేవలం 17-18 ఏళ్ల వారి సంఖ్యైతే 40శాతం దాటింది. ఎందుకింత సమస్య వస్తోంది? అసమానతల నిర్మూలనకు, ఆర్థిక స్వావలంబనకు విద్య అత్యవసరమని నమ్ముతున్న వ్యవస్థ మనది. ఇలాంటిచోట విద్యాలక్ష్యాల పతనాన్ని అడ్డుకోకపోతే సమాజం ఎలాంటి దుష్పరిణామాలు చూడాల్సి వస్తుంది?
Pratidwani : పాఠశాల ఫీజులు... ప్రభుత్వ నియంత్రణ
బడి బయట పిల్లలుగా మిగులుతున్న వారు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? దీనిపై ప్రభుత్వాలు, విద్యావ్యవస్థ వద్ద ఏమైనా సమాచారం, సమాధానం ఉంటోందా? పాఠశాల విద్య బలోపేతానికి, డ్రాపౌట్ల వంటి సమస్యల నివారణకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి? అయినా ఏళ్లుగా ఎందుకు మార్పు రావడం లేదు? తెలంగాణ సమాజానికి సంబంధించి మీరు గమనించిన అంశాలేంటి ఈ విషయంలో?
మరోవైపు బడిలో, కాలేజీల్లో ఉంటోన్న విద్యార్థుల ప్రమాణాలు, నైపుణ్యాలు, మేధో వికాసంపై కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. విద్యలో వేగంగా పెరుగుతున్న అంతరాలను పూడ్చడం ఎలా? దిగజారుతున్న విద్యా ప్రమాణాలను ఎలా కాపాడుకోవాలి. విద్యార్థులు అన్నిరకాల అసమానతలను అధిగమించి, పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు నిరంతరాయంగా చదువులు కొనసాగించాలంటే, కుటుంబాలు, ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహకారం అవసరం? ప్రాథమిక, ఉన్నతస్థాయి విద్యలో ప్రమాణాల స్థాపన గురించి నూతన విద్యావిధానం-2020 ఏం చెబుతోంది? విద్యాఅంతరాల నిర్మూలనకు ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? ఇదే అంశంపై ప్రతిధ్వని కార్యక్రమం.