Prathidwani : నవ్యాంధ్రప్రదేశ్‌లో అసలైన నవశకం ఇప్పుడు ప్రారంభమైంది. 2014లో నవ్యాంధ్ర అవతరించాక ఏర్పడిన తొలి ప్రభుత్వం విభజన గాయాలతో ప్రయాణం ప్రారంభించింది. 2019లో ఓ పెద్దకుదుపు ఓ విపత్తు వైఎస్సార్సీపీ రూపంలో రాష్ట్రానికి ఎదురైంది. విభజన గాయాలను మించిన గాయాలను 2019 నుంచి 2024 వరకు నవ్యాంధ్రప్రదేశ్ చవిచూసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం అన్నదే లేకుండా, అభివృద్ధికి ఏకపక్షంగా పట్టాభిషేకం చేస్తూ ప్రజలిచ్చిన తీర్పు చారిత్రాత్మకం.
కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాముఖ్యత పెరగటం మరో సదవకాశం. ఈ నేపథ్యంలోనే నవ్యాంధ్రలో నవశకం ప్రారంభం కానుంది. దేశాధినేతల సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఏపీ ప్రగతికి ఈ పరిణామం ఏ విధంగా బాటలు వేయనుందో నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం. ఈ చర్చలో రాజకీయ విశ్లేషకులు ఏ.శ్రీనివాసరావు, అమరావతి దళిత, బహుజన జేఏసీ నాయకులు పోతుల బాలకోటయ్య పాల్గొంటున్నారు.
Chandrababu Will Take Charge as Chief Minister : ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు అంతేస్థాయిలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ మొదటి 5 సంతకాలను ఇవాళ చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తారు. ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై రెండో సంతకం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపుపై మూడో సంతకం చేయనున్నారు. నైపుణ్య గణన, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపైనా సంతకాలు పెట్టనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లో ఈ సాయంత్రం 4:41 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకోనున్నారు.
Educated Ministers in AP CM Chandrababu Naidu Cabinet : రాష్ట్ర మంత్రివర్గంలో వైద్య, న్యాయ పట్టభద్రులతో పాటు ఇంజినీరింగ్, ఎంబీఏ, పీజీ, పీహెచ్‌డీ చేసినవారూ ఉన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంఏ ఎకనామిక్స్ చదివారు. జనసేన నుంచి మంత్రి అయిన కందుల దుర్గేష్‌కు కూడా ఇదే విద్యార్హత ఉంది. బీజేపీ నుంచి మంత్రి అయిన సత్యకుమార్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. నారా లోకేశ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, టీజీ భరత్ బ్రిటన్‌లో ఎంబీఏ, కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలో ఎంఎస్ చేశారు. నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్ ఇక్కడే వ్యాపార నిర్వహణలో మాస్టర్స్ చేశారు.
గొట్టిపాటి రవికుమార్ ఇంజినీరింగ్ చదివారు. డోలా బాల వీరాంజనేయస్వామి వైద్య విద్యను అభ్యసించారు. మండిపల్లి రాంప్రసాద రెడ్డి బీడీఎస్ చదువు మధ్యలో ఆపేశారు. నిమ్మల రామానాయుడు ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ను అందుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డ, వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర న్యాయ విద్య పూర్తి చేశారు. కొండపల్లి శ్రీనివాస్ యూఎస్‌లో ఎంఎస్ చదవగా పి.నారాయణ, వంగలపూడి అనిత పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సవిత, సంధ్యారాణి, బీసీ జనార్దనరెడ్డి, కొలుసు పార్థసారథి, అనగాని సత్య ప్రసాద్ డిగ్రీ చదివారు. అచ్చెన్నాయుడు బీఎస్సీ మధ్యలో ఆపేశారు. ఎన్‌ఎండీ ఫరూక్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.