Prathidwani Debate On Fire Accidents : వేసవిలో పెరిగిన ఎండలతోపాటు వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. జనావాసాలు, పారిశ్రామికవాడల్లో ఊహించనిరీతిలో చోటుచేసుకుంటున్న ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం జరుగుతోంది. నివాసగృహాలు, వాణిజ్య భవనాల్లో ప్రమాదం జరిగితే మంటలు అదుపు చేయడం కష్టంగా మారుతోంది. ఇక పొగలో, అగ్నికీలల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో కాపాడుతామన్న భరోసా లేకుండా పోతోంది.
అసలు నగరాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో వరుస అగ్ని ప్రమాదాలకు కారణాలేంటి? ఆపదలో ఉన్నవారిని రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది సన్నద్ధత ఎలా ఉంది? అభివృద్ధిచెందిన దేశాల్లో అమలవుతున్న విధానాలు ఏంటి? అత్యవసర పరిస్థితిలో ఫైర్ సేఫ్టీ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నివాసగృహాలు, కార్యాలయాలు, హోటళ్లు, ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ కోసం ఏఏ పరికరాల్ని అందుబాటులో ఉంచుకోవాలి? అగ్నిప్రమాదాలకు కారణమవుతున్న వస్తువులు ఏమిటి? వేసవికాలం పూర్తయ్యేదాకా వాటి నిర్వహణ ఎలా చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
మరోవైపు అగ్నిప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదని, అందరూ అప్రమత్తమైతే వాటిని నివారించడం చాలా తేలికని అగ్నిమాపక శాఖ అధికారులు అంటున్నారు. వంట చేసే సమయంలో మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ వినియోగంలో నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొంటున్నారు. ఇంటి పరిసరాల్లో చెత్త, వృథా వస్తువులు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నారు ప్రతి ఇంట్లో అగ్నిమాపక పరికరాలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు ఆ పరికరాలు ప్రాథమికంగా ఉపయోగపడతాయని ఇలాంటి పరికరాలు ఉపయోగించేలా ప్రజలు ప్రత్యేక శ్రద్ద వహించాలని చెబుతున్నారు.
అదేవిధంగా వాహనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని వివరిస్తున్నారు. తద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా ఆధునిక పరికరాలతో నగరాలు, పట్టణాల్లో జరిగే ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. ప్రజల్లో కూడా అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను చేపడుతున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">