ETV Bharat Prathidwani on One Vote Value : ఒక్క ఓటుతో ప్రభుత్వాలు కూలిపోయాయి. వ్యక్తుల తలరాతలు మారాయి. దేశ భవిష్యత్తునూ నిర్దేశించాయి. అందుకు చరిత్రే నిదర్శనం. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం. ఐదేళ్లకోసారి భవితను నిర్ణయించే సువర్ణావకాశం. సమర్థుడికి పట్టం కట్టాలన్నా అసమర్థుడిని సాగనంపాలన్నా ఓటుతోనే సాధ్యం. గ్రామ సర్పంచ్ నుంచి దేశ ప్రధాని వరకూ ఓటు ద్వారా ఎన్నికైనవారే. సమర్థులకు పట్టం కట్టడం ద్వారా ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం వద్దు. ఒక్క ఓటుతో చరిత్ర తారుమారైన సందర్భాలు అనేకం. మీ ఒక్క ఓటు సమాజంలో ఏం మార్పు తెస్తుందనే నిరుత్సాహం వద్దు. మీ ఓటే సంచలనం కావచ్చు. చరిత్ర గతిని మలుపుతిప్పవచ్చు. 'ఒక్క ఓటు విలువెంత?' అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో ప్రజాస్వామ్య పీఠం వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ, సుపరిపాలన వేదిక పద్మనాభరెడ్డి పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వాజ్‌పేయీని గద్దె దింపిన ఆ ఒక్క ఓటు : పార్లమెంటులో ఒక్క ఓటు ప్రధానమంత్రి భవిష్యత్తును నిర్ణయించింది. ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ తన పదవిని కోల్పోయారు. 1999లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే ఉండేది. ఆమె పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. 1999 ఏప్రిల్‌లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో కేంద్ర ప్రభుత్వం కూలిపోయింది. విపక్షాల్లో ఎవరికీ మెజార్టీ లేకపోవడంతో లోక్‌సభ రద్దయింది.
డ్రైవర్ ఓటూ ముఖ్యమే భాయ్! : 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంతెమరహళ్లి (ఎస్సీ) స్థానంలో జనతాదళ్ (సెక్యులర్) తరఫున ఏఆర్ కృష్ణమూర్తి, కాంగ్రెస్ తరఫున ధ్రువ నారాయణ పోటీ చేశారు. కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా, ధ్రువనారాయణకు 40,752 ఓట్లు వచ్చాయి. దీంతో కృష్ణమూర్తి ఒక్క ఓటుతో ఓటమి చవిచూశారు. అనంతరం ఆయన ఓ పత్రిక ముఖాముఖిలో మాట్లాడుతూ తన బద్ధశత్రువు కూడా ఒక్క ఓటుతో ఓడిపోవాలని కోరుకోడని వ్యాఖ్యానించారు. ఎన్నికల రోజు ఓటు వేయాలనుకున్న తన డ్రైవర్‌కు ఏఆర్ కృష్ణమూర్తి సమయం ఇవ్వకపోవడంతో ఆయన ఓటు వేయలేకపోయినట్లు తర్వాత కథనాలు వెలువడ్డాయి.
సీఎం పీఠం చేజారె : రాజస్థాన్‌లో 2008 శాసనసభ ఎన్నికల్లో నాత్‌ద్వార అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి సీపీ జోషి, బీజేపీ నుంచి కల్యాణ్‌సింగ్ చౌహాన్ పోటీ చేశారు. ఫలితాల్లో చౌహాన్‌కు 62,216 ఓట్లు వచ్చాయి. జోషికి 62,215 ఓట్లు రావడంతో ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. జోషి తల్లి, సోదరి, డ్రైవర్ ఎన్నికల రోజు ఓట్లు వేయడానికి వెళ్లలేదు. ఈ ముగ్గురూ ఓటు హక్కు వినియోగించుకుంటే ఫలితం వేరేగా ఉండేది. ఆ ఎన్నికల్లో జోషి రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగానే కాకుండా సీఎం రేసులో ముందున్నారు. పార్టీని విజయపథంలో నడిపించినా ఒక్క ఓటుతో ఓడిపోవడంతో సీఎం అయ్యే అవకాశాన్నీ కోల్పోయారు.
మిజోరంలో మూడు ఓట్లతో : మిజోరంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుయివాల్ (ఎస్టీ) స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌ఎల్ పియాన్మావియా మూడు ఓట్లతో ఓడిపోయారు. అక్కడ మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అభ్యర్థి లాల్‌చంద్‌మా రాల్టేకు 5,207 ఓట్లు రాగా, పియాన్మావియాకు 5,204 ఓట్లు పోలయ్యాయి. రీకౌంటింగ్‌లోనూ ఎలాంటి మార్పూ లేకపోవడంతో పియాన్మావియా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది.
రండి! 'అమ్మ'కు ఓటేద్దాం- 'అన్నపూర్ణ'ను గెలిపిద్దాం! - Vote for Amaravati
ఇవిగో మరిన్ని ఉదంతాలు : -
- 1649లో ఇంగ్లాండ్ రాజు కింగ్ ఛార్లెస్-1 శిరచ్ఛేదనంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే. ఆ తర్వాత క్రోమ్‌వెల్ ప్రభుత్వ హయాంలో బ్రిటన్ కామన్వెల్త్ రిపబ్లిక్‌గా ఆవిర్భవించింది.
- 1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజు సింహాసనం అధిష్ఠించారు.
- 1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికాలో జర్మన్ భాషను కాదని ఇంగ్లిష్ అధికారిక భాష అయింది.
- 1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది.
- 1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటుతో పదవీచ్యులతయ్యారు.
- 1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు. లేదంటే ప్రపంచ గతి ఎలా ఉండేదో!