Confederation of Indian Industries AP Chapter Opinion on Budget : కేంద్రం మధ్యంతర బడ్జెట్ లో పెట్టిన ఆక్వా పార్కుల్లో ఒకటి ఏపీకి కేటాయించాలని భారత పరిశ్రమల సమాఖ్య ఏపీ చాప్టర్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన మంచినీటి ఆక్వా పరిశ్రమ ఏపీలోనే ఉందని ఇక్కడి అవసరాలకు తగినట్టుగా అక్వా పార్కు కేటాయించాలని కోరింది. కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై సీఐఐ ఏపీ చాప్టర్ విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ద్రవ్యలోటు 5.1 శాతానికి తగ్గిస్తామని బడ్జెట్ లో చెప్పినా ఎలా తగ్గిస్తామన్నది స్పష్టం చేయలేదని పేర్కొంది.
మధ్యతరగతికి నిర్మల గుడ్న్యూస్! ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం- ఐదేళ్లలో రెండు కోట్ల ఆవాసాలు
నానో డీఏపీ ప్రకటన మంచి పరిణామమేనని, తద్వారా రవాణా ఖర్చులు తగ్గి వ్యవసాయానికి మేలు జరుగుతుందని సీఐఐ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు లక్ష్మీ ప్రసాద్ స్పష్టం చేశారు. నూనె గింజల దిగుమతిపై ఆధారపడుతున్న దేశంగా భారత్ పరిశోధనపై దృష్టి సారించాల్సి ఉందని అన్నారు. ఆయిల్ పామ్ కు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉందని, దిగుమతి డ్యూటీ తగ్గించటం వల్ల రేటు పడిపోయిందని తద్వారా స్థానిక పరిశ్రమ నష్టపోయిందని వెల్లడించారు.
ఇది భారత్ భవిష్యత్తును సృష్టించే బడ్జెట్- యువతకు లెక్కలేనన్ని అవకాశాలు'
స్కిల్ ఇండియా పై భారీగా వ్యయం చేస్తున్న కేంద్రం యువత నైపుణ్యాలు, విద్యా సంస్కరణలపై దృష్టి సారించాల్సి ఉందని లేకపోతే సమీప భవిష్యత్తులో భారత మానవ వనరుల సామర్ధ్యం గణనీయంగా తగ్గుముఖం పడుతుందని పారిశ్రామిక ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో లక్ష కోట్ల స్టార్టప్ కార్పస్ నిధులు కేటాయించినా అందుకు తగినట్టుగా ప్రోత్సాహక విధానాలు అమలు కావాలని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాలు బోధిస్తున్న పాఠ్యాంశాలకు, పరిశ్రమ అవసరాలకు భారీ వ్యత్యాసం ఉందని పారిశ్రామిక ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రస్తుత నైపుణ్యాలు సమీప భవిష్యత్ అవసరాలకు ఏమాత్రం సరిపోని పరిస్థితులు ఉన్నాయన్నారు.
మధ్యంతర బడ్జెట్ ఆకర్షణీయంగా ఉంది. సీఐఐ తరఫున 9వేల కంపెనీల తరఫున పలు సూచనలు చేశాం. అన్ని రంగాలు అభివృద్ధి సాధించేలా ప్రతిపాదనలు పంపించాం. ఇండియా జీడీపీ, ఉద్యోగిత పెరగాలంటే యువత సాఫ్ట్వేర్ దిశగానే సాగాలన్న ప్రచారం ఉంది. ఆ దిశగానే ఉపాధి అవకాశాలు, విద్యా విధానం కొనసాగుతోంది. కానీ, భవిష్యత్ అవసరాలకు ఇవేమీ సరిపోవు. అందుకే గత ఏడాది కాలంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కంపెనీలు కోత విధిస్తున్నాయి. ఆక్వా, టూరిజం రంగాల్లో అవకాశాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. మన దేశంలో ఆ రెండు రంగాల్లో మానవ వనరులను పెంచాలి. లాజిస్టిక్ వనరులను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కేపబిలిటీ కూడా అత్యంత ముఖ్యమైన విషయం. - లక్ష్మీ ప్రసాద్, అధ్యక్షుడు, సీఐఐ, ఏపీ చాప్టర్, డి.రామకృష్ణ, సీఐఐ ప్రతినిధి
'అసమానతలు లేని భారత్ మా లక్ష్యం- 2047 నాటికి పేదరికం కనబడదు!''