2024 Lok Sabha Elections Analysis Uttarakhand : దేవభూమి ఉత్తరాఖండ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఆసక్తిగా మారాయి. 5 లోక్‌సభ స్థానాలున్న ఈ చిన్న రాష్ట్రంలో మరోసారి అన్ని సీట్లలో విజయం సాధించాలని బీజేపీ తహతహలాడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బీజేపీకు ఉమ్మడి పౌరస్మృతి కీలక ప్రచారాస్త్రం కానుంది. వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని వారాల ముందే పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా కూడా ఉత్తరాఖండ్ నిలిచింది. భవిష్యత్‌లో ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం UCC తరహా బిల్లులను తీసుకొచ్చే అవకాశం ఉంది. పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో మాత్రమే ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ, ఈసారి UCC అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. 370 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్ట తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రతి సీటును అత్యంత ముఖ్యంగా భావిస్తోంది.
బీజేపీకి కలిసొచ్చే అంశాలు
UCC అంశంతో పాటు రామమందిర ప్రారంభం, మోదీ చరిష్మా కూడా బీజేపీకు సార్వత్రిక ఎన్నికల్లో దోహదపడనున్నాయి. ప్రధాని మోదీ గత కొన్నేళ్లుగా తరచూ ఉత్తరాఖండ్‌కు వెళ్లి కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లోని ప్రాజెక్టులను స్వయంగా పర్యవేక్షించారు. గత నవంబర్‌లో సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అంశం కూడా బీజేపీకు కలిసి రానున్నట్టు తెలుస్తోంది. కార్మికులను రక్షించేందుకు కేంద్రం చూపిన చొరవే అందుకు కారణం. అభివృద్ధి పనులు, అన్ని వాతావరణ పరిస్థితుల్లో చార్‌ధామ్ యాత్ర చేసేలా ఆల్ వెదర్ రోడ్డు, రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైన్ సహా రైలు-విమాన కనెక్టివిటీ ప్రాజెక్టులు బీజేపీకి అనుకూలంగా మారనున్నాయి. మత మార్పిడి నిరోధక చట్టంతో పాటు ప్రభుత్వ భూమిలో అక్రమ సమాధులకు అడ్డుకట్ట వంటి నిర్ణయాలు బీజేపీకు కలిసిరానున్నాయి. వీటితో పాటు పరీక్షల్లో ఎలాంటి కాపీయింగ్ జరగకుండా తీసుకొచ్చిన దేశంలోనే "కఠినమైన" కాపీయింగ్ నిరోధక చట్టాన్ని ప్రచారంలో బీజేపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.
ఉత్తరాఖండ్‌లో 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 5 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ బీజేపీ జయకేతనం ఎగురవేసింది. అంతేకాకుండా 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. దేవభూమిలోని ఐదు లోక్‌సభ స్థానాల్లో మూడింటిలో ఈ సారి బీజేపీ సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపింది. నైనితాల్-ఉధంసింగ్ నగర్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి అజయ్ భట్ పోటీ చేస్తున్నారు. తెహ్రీ గర్వాల్ నుంచి రాజ్య లక్ష్మి షా బరిలో ఉన్నారు. ఏకైక SC రిజర్వుడు సీటు అయిన అల్మోరా నుంచి అజయ్ టమ్టా బరిలోకి దిగారు.
కాంగ్రెస్ అస్త్రాలు
మరోవైవు ఉత్తరాఖండ్‌లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కనీసం రెండు లోక్‌సభ సీట్లను దక్కించుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న అవినీతి , మహిళలపై నేరాల పెరుగుదల వంటి సమస్యలను ప్రచారంలో కాంగ్రెస్ ప్రధానంగా లేవనెత్తుతోంది. బీజేపీ బలాలుగా భావిస్తున్న రామమందిరం, UCC కంటే ఈ సమస్యలే ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపి ఓట్లను రాబడతాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది. జోషిమఠ్‌లో భూమి కుంగడం, సిల్‌క్యారా టన్నెల్‌లో ప్రమాదం జరిగి 41 మంది కార్మికులు అందులో చిక్కుకోవడం వంటి అంశాలపై అంతకుముందు కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీజేపీ మాజీ నేత కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉన్న అంకితా భండారీ హత్య కేసు అంశంపై గతంలో కమలం పార్టీపై కాంగ్రెస్ విరుచుకుపడింది.
బీజేపీ బలహీనతలు
2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క లోక్‌సభ సీటును గెలుచుకోలేకపోయినప్పటికీ, హరిద్వార్, నైనితాల్-ఉధమ్ సింగ్ నగర్ వంటి కీలకమైన పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో కాంగ్రెస్ బలాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉత్తరాఖండ్‌లో 18 స్థానాల్లో గెలుపొందింది. దేవభూమిలో కొన్ని చోట్ల ఓటర్లు మార్పు కోరుకుంటున్నారనీ అవి బీజేపీకు ప్రతికూలంగా మారబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో శాంతిభద్రతలు, మైదాన ప్రాంతాలకు వలసల వంటి సమస్యలను కాంగ్రెస్ తమ ఎన్నికల ప్రచారంలో లేవనెత్తుతోంది. ఉత్తరాఖండ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలివిడతలోనే పోలింగ్ జరగనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">