Vijayawada Girl Excelling in Skating : ఈ అమ్మాయికి స్కేటింగ్ అంటే ఎంతో ఇష్టం. పాఠశాల రోజుల నుంచే ప్రతిభ చూపుతూ పతకాలు పట్టుకొస్తుంది. శిక్షణకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడవ్వడంతో చదువుల్లో రాణిస్తూనే స్కేటింగ్‌లోనూ అదరగొడుతోంది. ఇటీవల జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. అంతర్జాతీయంగానూ బంగారు పతకాలు అందుకుందీ ఈ క్రీడారత్నం.
ఈ అమ్మాయి పేరు పెద్దిరెడ్ల చెైత్రదీపిక. స్వస్థలం విజయవాడ. తండ్రి సతీశ్ నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి లలితకి స్కేటింగ్ అంటే చాలా ఇష్టం. తను పలు కారణాలతో ఆటకు దూరమైనా కుమార్తె ఆసక్తి చూపిస్తుండడంతో మేటిగా తయారు చేయాలని సంకల్పించిది. అలా తల్లి కోసం స్కేటింగ్‌లో చేరింది ఆ బాలిక.
"ఐదు సంవత్సరాల వయస్సులో స్కేటింగ్‌లో చేరాను. నా కోచ్‌లు చిట్టిబాబు, సత్యంలు సపోర్ట్ చేశారు. అలాగే నా గురువులు, తలిదండ్రుల అండంతోనే పతకాలు సాధించాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పాల్గొన్నాను. పాఠశాలలో జరిగే వివిధ ఆటల పోటీల్లో పాల్గొంటాను. అందులో కూడా పతకాలు సాధించాను." - చెైత్రదీపిక, స్కేటింగ్ క్రీడాకారిణి
హాబీగా స్కేటింగ్ మొదలు పెట్టిన చెైత్రదీపిక క్రమంగా దానినే కెరీర్‌గా ఎంచుకుంది. కుమార్తె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు కోచ్ సత్యం వద్ద మెళకువలు నేర్పించారు. నిత్యం సాధన చేస్తూ అనతికాలంలోనే అందులో పట్టు సాధించింది. విశాఖ వేదికగా జరిగిన పలు స్కేటింగ్ పోటీల్లో ఆ అమ్మాయి ప్రతిభ కనబరిచింది. తర్వాత విజయవాడ డీఆర్ఆర్ స్టేడియంలో ఉన్న స్కేటింగ్ రింగ్‌లో సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటింది.
Vijayawada Skater Chaitra Deepika Story : అలా స్కేటింగ్‌లో రాణించి ఇప్పటి వరకు 52 పతకాలు సాధించింది చైత్రదీపిక. అందులో 14 బంగారు పతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా ఛాంపియన్‌షిప్ పోటీల్లో పెయిర్ విభాగంలో పాల్గొని అద్భుత ప్రదర్శన చేసి బంగారు పతకం సాధించింది. ఈ ఏడాది తమిళనాడులో జరిగిన సెకండ్ ఇండియా స్కేట్ గేమ్స్‌లో 3 పతకాలు సాధించి మరోసారి ప్రముఖుల మన్ననలు అందుకుంది ఈ అమ్మాయి.
స్కేటింగ్‌లో చైత్ర ఆసక్తిని చూసి ప్రోత్సహించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదే పట్టుదలతో సాధన చేస్తే భవిష్యత్‌లో అంతర్జాతీయంగా రాణిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఇష్టమైన స్కేటింగ్ క్రీడలో సత్తా చాటుతోంది చైత్ర. ఆసియా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం అందుకుంది. ప్రభుత్వ ఆర్థికంగా సహకరిస్తే అంతర్జాతీయగా రాణిస్తానని చెబుతోంది ఈ క్రీడాకారిణి.