India's Greatest Teachers List : ప్రతి మనిషీ నిత్య విద్యార్థే. ఈ జీవిత ప్రయాణంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొందరి ప్రభావం మనపై ఉంటుంది. ఇలా.. తమ బోధనల ద్వారా కోట్లాది మందిని ప్రభావితం చేసిన విశ్వగురువులు భారత చరిత్రలో చాలా మందే ఉన్నారు. అలాంటి ఇండియన్ గ్రేటెస్ట్ టీచర్స్ లో కొందరి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గౌతమ బుద్ధుడు : బహుశా భారతీయ చరిత్రలో ఇప్పటి వరకు మనకు తెలిసిన మొదటి గురువుగా గౌతమ బుద్ధుడిని చెప్పుకోవచ్చు. జ్ఞానోదయం కోసం తన రాజ సౌఖ్యాలను త్యజించిన యువరాజు సిద్ధార్థుడు.. ఆ తర్వాత బుద్ధుడిగా మారాడు. ఈయన బోధనలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేశాయి. నాటి నుంచి నేటి వరకూ ఎంతో మంది ఆయన చూపిన బాటలో నడుస్తున్నారు.
చాణక్యుడు : భారతదేశానికి చెందిన గొప్ప ఉపాధ్యాయులలో చాణక్యుడు ఒకరు. ఈయన ప్రాచీన భారతదేశానికి చెందిన మేధావి, ఆర్థికవేత్త, రాజనీతివేత్త, గొప్ప తత్వవేత్త. చాణక్యుడినే.. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈయన అర్థశాస్త్రం అనే గ్రంథంలో రాజనీతి, ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం గురించి చాలా చక్కగా వివరించారు.
స్వామి దయానంద సరస్వతి : ఈయన అసలు పేరు మూలశంకరుడు. వేదానికి ‘సరస్వతి’ అనే పేరుంది. వేదజ్ఞానాన్ని ఆర్జించినవాడు కనుక దయానంద సరస్వతి అనే పేరు ఆయనకు సార్థకమైంది. శాస్త్ర చర్చల్లో ఎందరో పండితులను ఓడించి, వేదధర్మమే గొప్పదని వివరించి స్వామి అయ్యారు. అవిద్యను రూపు మాపి, విద్యాప్రకాశం కోసం కృషి చేసిన మహాపురుషుడు దయానంద సరస్వతి.
స్వామి వివేకానంద : యువతపై వివేకానంద ప్రభావం ఎంతో ఉంటుంది. వివేకానంద బోధనలు ఎంతో మందిలో స్పూర్తి నింపాయి. ఇప్పటికీ ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని వివేకానంద చెప్పేవారు.
ప్రథమ నమస్కారం గురువుకే ఎందుకో తెలుసా?
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ : విద్యారంగానికి సర్వేపల్లి విశేషమైన కృషి చేశారు. అందుకే ఆయన చేసిన సేవలకు గౌరవార్థంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును(సెప్టెంబర్ 5) టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఈయన ప్రముఖ పండితుడు, ఉపాధ్యాయుడు. అంతేకాదు.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా గౌరవనీయమైన పదవులను నిర్వహించారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ : ఈయన ప్రధానంగా కవిగా గుర్తింపు పొందినా.. విద్యకు ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా 1901లో శాంతినికేతన్ పాఠశాలను నెలకొల్పారు. ప్రస్తుతం దీనిని విశ్వభారతి పాఠశాలగా పిలుస్తారు. అంతేకాదు.. విద్యలో వినూత్న పద్ధతులు తీసుకొచ్చారు. అలాగే.. ప్రజలను ప్రకృతితో అనుసంధానించడం, సంపూర్ణ అభ్యాస అనుభవాలను పెంపొందించడమే లక్ష్యంగా ఆయన విశేష కృషి చేశారు.
సావిత్రిబాయి పూలే : ఈమె భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి దేశంలోని బాలికలు, అట్టడుగు వర్గాలకు విద్యను అందించడం కోసం ఎంతో పోరాడారు సావిత్రిబాయి పూలే. 1848లో ఇండియాలో మొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. ఉపాధ్యాయురాలిగా మాత్రమే కాకుండా మహిళల హక్కుల కోసం కూడా ఈమె ఎంతో పోరాటం చేశారు.
డాక్టర్ APJ అబ్దుల్ కలాం : "మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా"గా పేరొందిన డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం.. ప్రముఖ శాస్త్రవేత్త, భారతదేశ 11వ రాష్ట్రపతిగా కూడా పనిచేశారు. ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన కలాం లక్షలాది మంది చిన్నారులను తమ జీవితంలో ముందుకు సాగేలా ప్రేరేపించారు. దేశ సవాళ్లను పరిష్కరించడానికీ, బలమైన భారతదేశానికి యువతే కీలకమని, వారిని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే ప్రధాన భూమిక అంటారు కలాం. అందుకే.. తనను తాను ఒక ఉపాధ్యాయుడిగా చెప్పుకోవడం తనకు ఎంతో ఇష్టమని అన్నారు.