How to Make Street Style Onion Mixture Masala: స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైనా, ఆఫీసుల నుంచి వచ్చిన పెద్దలకైనా.. ఈవెనింగ్ టైమ్ ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది. అలాగే.. కొందరికి అప్పుడప్పుడు నోటికి ఏదైనా కాస్త పుల్లగా, కారంగా తినాలనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో సింపుల్‌గా ఐదే ఐదు నిమిషాల్లో ఇలా "ఉల్లి మిక్చర్"ని ప్రిపేర్ చేసుకొని ఆస్వాదించండి. ఇది రుచిలో రోడ్ సైడ్ బండ్ల మీద దొరికే దానికి ఏమాత్రం తీసిపోదు. అంత టేస్టీగా ఉంటుంది! ఇంతకీ, దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- అటుకులు - 1 కప్పు
- ఉల్లిపాయలు - 2(పెద్ద సైజ్‌లో ఉన్నవి)
- నూనె - వేయించడానికి తగినంత
- పల్లీలు - పావు కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - 1 టీస్పూన్
- పసుపు - చిటికెడు
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- చాట్ మసాలా - 1 టీస్పూన్
- కొత్తిమీర - కొద్దిగా
- నెయ్యి - 1 స్పూన్
- నిమ్మకాయ - 1
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి. అలాగే.. కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక.. అటుకులు వేసి వేయించుకోవాలి.
- అయితే, అటుకులు పల్చగా ఉండేవి కాకుండా కాస్త మందంగా ఉండేవి ఎంచుకోవాలి. అలాగే.. నూనె కాగకముందే అటుకులు వేసుకోవద్దు. అలా వేస్తే అటుకులు నూనె ఎక్కువ పీల్చుకోవడమే కాకుండా సరిగ్గా పొంగవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- ఇక వేయించిన అటుకులను ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి తీసుకోవాలి.
- ఆ తర్వాత అదే నూనెలో పల్లీలను వేసి వేయించుకోవాలి. ఆపై పల్లీలను అటుకులు వేసుకున్న గిన్నెలోనే వేసుకొని ఒకసారి బౌల్‌ను చేతులతో పైకి కిందకి షేక్ చేసుకోవాలి. అనంతరం గిన్నెలో ఉన్న టిష్యూ పేపర్‌ను తీసేయాలి.
- ఇప్పుడు.. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా, కొత్తిమీర తరుగు, నెయ్యి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆపై నిమ్మరసం పిండి అంతా మాష్ చేస్తూ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
- అంతా బాగా మిక్స్ చేసుకున్నాక టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు, కారం, పులుపు వంటివి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "మసాలా ఉల్లి మిక్చర్" రెడీ!
- దీన్ని సాయంకాలం సమయాన అలా నడుచుకుంటూ తింటుంటే ఆ ఫీలింగ్ వేరే లెవల్లో ఉంటుంది! మరి, ఆలస్యమెందుకు మీరూ ఓసారి ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి.
ఇవీ చదవండి :
నోరూరించే క్రిస్పీ "ఆనియన్ సమోసా" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండి! - టేస్ట్ మాత్రం వేరే లెవల్!