Benefits Of Neem Water in Telugu : మనలో చాలా మందికి వేప చెట్టు అనగానే.. ఉదయం పళ్లు తోముకోడానికి వేప పుల్లలు, ఉగాది పచ్చడిలో వేసుకోవడానికి వేప పువ్వు ఉపయోగిస్తామనే విషయాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ.. వేపాకులతో కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. అందులోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. జుట్టు, చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు. ఇందుకోసం.. మీరు చేయాల్సిందల్లా డైలీ వేపాకు నీటితో స్నానం చేయడమే! ఇంతకీ, వేపాకు(Neem Leaves) నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఆ నీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వేపాకులో బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడే సహజ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను నివారించడంలో చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ సి. అంజలీదేవి. అలాగే ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. ఇవి శరీరాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. కాబట్టి.. వేపాకుల నీటితో స్నానం చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. మరీ.. ముఖ్యంగా వేపాకుల్లో ఔషధ గుణాలు చర్మం సంరక్షణకు, జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతాయని చెబుతున్నారు.
మొటిమలకి బెస్ట్ మెడిసిన్ : చాలా మంది ఎదుర్కొనే చర్మ సమస్యల్లో ఒకటి.. మొటిమలు. ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాకాకుండా వేపాకు నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. మొటిమల సమస్య తగ్గడమే కాకుండా ఫేస్ కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు.
మచ్చలకి దివ్యౌషధం : ఎక్కువ మందిని వేధించే చర్మ సమస్యల్లో మరొకటి.. ముఖంపై మచ్చలు. ఆ సమస్యను తగ్గించడంలో వేపాకులు మంచి ఔషధంలా పనిచేస్తాయంటున్నారు డాక్టర్ అంజలీదేవి. ఇందుకోసం కొన్ని వేపాకుల్ని తీసుకొని పేస్టులా చేసుకొని.. అందులో 2 స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆపై కాసేపు ఆగి ముఖం కడుక్కుంటే సరిపోతుందట.
ఎందుకండీ అవసరం లేకున్నా మందులు మింగుతారు? - డైలీ రెండు వేపాకులు తినండి మీ ఆరోగ్యం అంతా సెట్!
దురద : కొందరికి అప్పుడప్పుడూ స్కిన్‌పై బొబ్బలు, పుండ్లు వస్తుంటాయి. అలాంటి టైమ్‌లో వేపాకు నీటితో స్నానం చేయడం ద్వారా మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. అందులోని ఔషధ గుణాల కారణంగా బొబ్బలు, దద్దుర్లు తగ్గడంతో పాటు ఇంకేమైనా చర్మ సమస్యలు(National Library of Medicine రిపోర్టు) ఉన్నా తగ్గిపోతాయంటున్నారు.
చెమటలు : సీజన్ ఏదైనా కొందరికి చెమటలు ఎక్కువగా వస్తుంటారు. అంతేకాకుండా భరించలేని చెమట వాసన వస్తుంటుంది. అలాంటివారు వేపాకు నీటితో స్నానం చేయడం వల్ల మంచి రిలీఫ్ లభిస్తుందంటున్నారు నిపుణులు. చెమట, చెమట వాసన పూర్తిగా తగ్గిపోతాయని సూచిస్తున్నారు.
చుండ్రుకి చెక్ పెట్టొచ్చు : ఈరోజుల్లో చాలా మంది రకరకాల జుట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో.. చుండ్రు ఒకటి. దాన్ని తగ్గించుకోవడం కోసం ఎన్నో షాంపూలు, ఆయిల్స్ వాడుతుంటారు. అయినా రిజల్ట్ నామమాత్రమే. అలాంటి వారు రెగ్యులర్‌గా వేపాకు నీటితో స్నానం చేసినా.. లేదంటే వేప చూర్ణాన్ని జుట్టుకు అప్లై చేసినా ఈజీగా సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు డాక్టర్ అంజలీదేవి. అంతేకాదు.. జుట్టు ఆరోగ్యకరంగా మారుతుందని, పేల సమస్య తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.
వేపాకు నీటిని ఎలా రెడీ చేసుకోవాలంటే?
ఇందుకోసం ముందుగా కొన్ని వేపాకులు తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆపై వాటిని మీరు స్నానం చేయాలనుకుంటున్న నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి. అంటే.. వాటర్ కాస్త గ్రీన్ కలర్లోకి మారేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. అంతే.. ఆ తర్వాత ఆ నీటిని మీ బాడీ భరించగలిగే వేడితో తీసుకుని స్నానం చేయాలంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మెరిసే చర్మం కోసం వేపాకు ఫేస్ ప్యాక్- మొటిమలకు చెక్! ట్రై చేయండిలా!