Legal Advice on Mother-in-Law Property Rights : ఉద్యోగరిత్యా ముంబయిలో స్థిరపడి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు భార్యాభర్తలు. అయితే.. వారు ముంబయిలో స్థిరపడటం వల్ల ఊళ్లో ఉన్న పొలాన్ని వారి బావగారు (భర్త అన్న) సాగు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త ప్రమాదంలో మరణించారు. పిల్లల చదువుల కోసం ఆమె అక్కడే ఉండాల్సిన పరిస్థితి. అంతేకాదు.. అనారోగ్యానికి గురైన అత్తగారి బాగోగులు కూడా తనే చూసుకుంటోంది. ఆ కృతజ్ఞతతో ఎకరం భూమిని ఆమె పేరున రిజిస్ట్రేషన్ చేయించారు అత్తగారు.
ఇది తెలిసినప్పటి నుంచీ ఊరిలో ఆమె పొలాన్ని సాగుచేస్తున్న బావ.. పంట తాలూకు డబ్బులు ఇవ్వడం ఆపేశారు. అత్తగారు రాసిచ్చిన పొలంపై ఆమెకు హక్కు లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. పంచాయితీకి పెద్దమనుషులు పిలుస్తున్నా రావడం లేదు. దీంతో.. ఇప్పుడు తాను ఏం చేయాలో తెలియక న్యాయ నిపుణుల సలహా కోరుతున్నారు. మరి.. ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది జి. వరలక్ష్మి ఎలాంటి సమాధానం ఇచ్చారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
ముందుగా మీ అత్తగారు రాసింది వీలునామానా, గిఫ్ట్ డీడా? అన్న విషయం తెలుసుకోవాల్సి ఉంది. ఒకవేళ అది.. వీలునామా అయితే అత్తగారి మరణానంతరమే ఆ పొలం మీకు చెందుతుంది. అదే.. గిఫ్ట్ డీడ్ అయితే ఆమె రాసిచ్చిన ఎకరం భూమిపై మీకు సంపూర్ణ హక్కు ఉంటుంది.
"మీ పొలం హక్కు కోసం డిక్లరేషన్ ఆఫ్ టైటిల్, పొసెషన్ స్వాధీనం కోసం కోర్టులో ఒక దావా వేయండి. అది ఇప్పటికే మీ పేరున(చనిపోయిన వ్యక్తి భార్య) ఉంటే.. కేవలం పొసెషన్ కోసమే ఈ దావా వేయండి. అప్పుడు న్యాయస్థానం.. ఇప్పటివరకూ మీ బావ అనుభవిస్తున్న, అనుభవించిన మీ పొలం తాలూకు అయివేజు(పొలం మీద వచ్చే పంట తాలూకు డబ్బు) కోర్టులో డిపాజిట్ చేయమని అడగొచ్చు"-జి.వరలక్ష్మి, న్యాయవాది
ఈ సమస్యకు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం దొరికే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి కోర్టులో దావా వేసుకోవడమే సరైన మార్గం. అదేవిధంగా.. "ముందు మీ ఆస్తిని మీకు స్వాధీనం చేయమనీ, దానికి సంబంధించిన లావాదేవీలు తేల్చమనీ ఆయనకో లాయర్ నోటీస్ ఇవ్వండి. దానికి మీకు అనుకూలమైన సమాధానం వస్తే సరి. అలాకాకుండా.. ఆయన పొలం అప్పగించడానికి ఇష్టపడకపోతే.. మీ బావని ప్రతివాదిగా చేర్చి కోర్టులో దావా వేయక తప్పదు. ఒకవేళ.. ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో పట్టాపై మీ పేరు నమోదు చేయించుకోకపోతే ముందు ఆ పని చేయండి. అప్పుడు కోర్టుకి వెళితే విజయం మీదే అవుతుంది" అని సలహా ఇస్తున్నారు న్యాయవాది జి. వరలక్ష్మి.
Note: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. న్యాయవాదుల సలహాలు, చట్ట ప్రకారం పాటించాల్సిన సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత న్యాయవాది సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
మీకు జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? ఈ హక్కుల గురించి తెలుసా?- కొత్త చట్టాలు ఏం చెబుతున్నాయంటే?