Curry Leaf Cauliflower Fry Recipe : పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయల్లో ఒకటి క్యాలీఫ్లవర్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దీన్ని కొందరు అంతగా తినడానికి ఇష్టపడరు. ఇక పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీ పిల్లలూ క్యాలీఫ్లవర్ తినడానికి ఇష్టపడట్లేదా? అయితే, ఓసారి కరివేపాకు క్యాలీఫ్లవర్‌తో ఈ స్నాక్ రెసిపీని చేసి పెట్టండి. సూపర్ టేస్టీగా ఉండే ఈ రెసిపీ చిన్నా పెద్దా అందరికీ తెగ నచ్చేస్తుంది. క్యాలీఫ్లవర్, కరివేపాకు తినడానికి ఇష్టపడనివారూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతకీ, దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- క్యాలీఫ్లవర్ - 1(పెద్ద సైజ్ది)
- ఉప్పు - కొద్దిగా
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- జీలకర్ర - అరటీస్పూన్
- ఆవాలు - అరటీస్పూన్
- అల్లం ముక్క - అంగుళం సైజ్ది
- వెల్లుల్లి రెబ్బలు - 10 నుంచి 15
- పచ్చిమిర్చి - 3
- మిరియాలు - అరటీస్పూన్
- కరివేపాకు - పిడికెడు
- మైదా - 1 టేబుల్‌స్పూన్
- కార్న్‌ఫ్లోర్ - 1 టేబుల్‌స్పూన్
- బియ్యప్పిండి - 1 టేబుల్‌స్పూన్
- శనగపిండి - 1 టేబుల్‌స్పూన్
- నూనె - వేయించడానికి తగినంత
- చాట్ మసాలా - కొద్దిగా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా క్యాలీఫ్లవర్ చుట్టూ ఉండే ఆకులు తొలగించి కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి.
- ఇప్పుడు వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి మరిగే వేడి వేడి వాటర్‌ను పోసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత జాలీ గంటె సహయంతో వేడినీటిని వడకట్టుకొని క్యాలీఫ్లవర్ ముక్కలను కాసేపు అందులోనే ఉంచి చల్లార్చుకోవాలి. ఇలా క్యాలీఫ్లవర్‌ను వేడినీటిలో నానబెట్టుకోవడం వల్ల ఫ్రై చేసుకునేటప్పుడు మరీ పచ్చిగా ఉండకుండా త్వరగా మగ్గుతుంది.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, మిరియాలతో పాటు పచ్చిమిర్చిని తుంపి వేసుకొని 30 సెకన్ల పాటు వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక వెంటనే కరివేపాకు వేసుకొని అందులోని కాస్త పసరు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అంతేకానీ, తాలింపు మాదిరిగా కరకరలాడేలా కరివేపాకును వేయించుకోవాల్సిన పనిలేదు.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మీరు వేయించుకున్న కరివేపాకు మిశ్రమాన్ని వేసుకొని చాలా తక్కువ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంటే కరివేపాకు పేస్ట్ మరీ జారుడుగా ఉండకుండా గట్టిగా ఉండేలా చూసుకోవాలి.
- ఆపై మీరు మిక్సీ పట్టుకున్న కరివేపాకు పేస్ట్‌ను ఒక ప్లేట్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, మైదా పిండి, బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, శనగపిండి వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో పూర్తిగా చల్లారి నీరంతా దిగిపోయిన ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి కరివేపాకు పిండి మిశ్రమం ముక్కలకు పట్టేలా నెమ్మదిగా కోట్ చేసుకోవాలి.
- ఒకవేళ పిండి మిశ్రమం క్యాలీఫ్లవర్ ముక్కలకు పట్టట్లేదనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కోట్ చేసుకోవాలి. అయితే, వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఎందుకంటే పేస్ట్ ఏమాత్రం జారుడుగా ఉన్నా వేయించుకునేటప్పుడు నూనెలో విడిపోయి పడిపోతుందనే విషయం గుర్తుంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మీరు కోట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
- క్యాలీఫ్లవర్ ముక్కలు క్రిస్పీగా వేగి గోల్డెన్ కలర్లోకి వచ్చాక అందులో నాలుగు పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత వాటిని తీసి కాసేపు జల్లి గంటెలో ఉంచాలి. కాసేపటికి అవి మరింత క్రిస్పీ అవుతాయి. ఇక వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా చాట్ మసాలాను వాటిపై చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలు.
- అంతే.. ఎంతో టేస్టీగా ఉండే వెడ్డింగ్ స్టైల్ "కరివేపాకు క్యాలీఫ్లవర్ స్నాక్ రెసిపీ" రెడీ!
ఇవీ చదవండి :
కరకరలాడే "ఎగ్ కట్లెట్స్" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ వేరే లెవల్ అంతే!
సూపర్ స్నాక్ రెసిపీ - క్రిస్పీ "సొరకాయ బజ్జీలు" - 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!