Karam Chips with Rice Flour in Telugu : వాతావరణం కూల్‌గా ఉన్నప్పుడు సాయంకాలం కారం కారంగా ఏదైనా తినాలనిపించడం సహజం. ఈ క్రమంలోనే కొందరు ఇంట్లోనే పకోడీలో, సమోసాలో చేసుకుంటే.. మరికొందరు ఆలూ చిప్స్ వంటివి ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ బంగాళదుంపతోనే కాకుండా ఈసారి వెరైటీగా ఇలా బియ్యప్పిండితో "కరకరలాడే కారం చిప్స్" ప్రిపేర్ చేసుకోండి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యప్పిండి - 1 కప్పు(పావు కిలో)
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - 1 టీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- నువ్వులు - 1 టీస్పూన్
- నెయ్యి/బటర్ - 1 టేబుల్ స్పూన్
- పసుపు - చిటికెడు
- నూనె - వేయించడానికి తగినంత
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యప్పిండిని తీసుకొని జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని బియ్యప్పిండిని తీసుకున్న కప్పుతో ముప్పావు కప్పు వాటర్ పోసుకోవాలి. ఆపై అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, నువ్వులు, సన్నగా తరుక్కున్న కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి/బటర్, పసుపు.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఆ నీళ్లను బాగా వేడి చేసుకోవాలి.
- నీళ్లు బాగా మరిగాయనుకున్నాక.. స్టౌ ఆఫ్ చేసుకొని జల్లెడ పట్టుకున్న బియ్యప్పిండిని అందులో వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి.
- ఆ విధంగా కలుపుకున్నాక.. ఆ మిశ్రమాన్ని మళ్లీ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అది కాస్త గోరువెచ్చగా అయ్యాక చేతితో అవసరాన్ని బట్టి చల్లని నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఆపై మూతపెట్టి 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
- అయితే, పిండిని మరీ పల్చగా కాకుండా పూరీ పిండిలా సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండిని అలా కలుపుకోవడం వల్ల చిప్స్ కరకరలాడుతూ రావడమే కాకుండా ఆయిల్ ఎక్కువ పట్టకుండా చాలా బాగా వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- 10 నిమిషాల తర్వాత పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత.. అందులో నుంచి బాల్ సైజంత పిండిని తీసుకొని చేతితో రౌండ్‌గా చేసుకొని పొడి పిండిని అన్ని వైపులా అద్దుకోవాలి.
- ఇప్పుడు.. చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఆ పిండి ముద్దను చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకునేటప్పుడు పిండి అతుక్కపోయినట్లనిపిస్తే చపాతీలా చేసుకునే పిండి పైన కింద కొంచం పొడి పిండి చల్లుకొని రోల్ చేసుకోవాలి.
- అయితే.. మరీ మందంగా, పల్చగా కాకుండా చపాతీ కంటే కాస్త మందంగా ఉండేలా ఆ పిండి ముద్దను రోల్ చేసుకోవాలి.
- ఆ విధంగా రోల్ చేసుకున్నాక.. దాన్ని పిజ్జా కట్టర్ లేదా చాకు సహాయంతో ముందుగా స్క్వేర్ షేప్ వచ్చేలా సైడ్స్ కట్ చేసుకోవాలి.
- ఆపై దాన్ని ముందుగా చిన్న చిన్న స్క్వేర్ బాక్సులు వచ్చేలా కట్ చేసుకొని తర్వాత త్రిభుజాకారం లేదా డైమండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
- అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక.. కట్ చేసుకున్న ట్రై యాంగిల్ చిప్స్ వేసి వేయించుకోవాలి.
- అయితే, చిప్స్ వేయించుకునేటప్పుడు నూనెలో వేశాక వెంటనే వాటిని టర్న్ చేయకుండా కాసేపు అలాగే ఉంచి ఆ తర్వాత గరిటెతో తిప్పుకుంటూ మంచిగా వేగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "కరకరలాడే కారం చిప్స్" రెడీ!
ఇవీ చదవండి :
బియ్యప్పిండితో జంతికలు చేస్తే గట్టిగా వస్తున్నాయా? - ఇలా ట్రై చేస్తే కరకరలాడుతూ గుల్లగా వస్తాయి!