Hybrid Bike Runs with Hydrogen and Water Designed by Anantapur's Young Man Varun Kumar : అతడి లక్ష్యం సివిల్స్ సాధించడం. కానీ కుటుంబ పరిస్థితులు ఉద్యోగంలో చేరేలా చేశాయి. దాంతో ఓ ప్రభుత్వ ఐటీఐలో విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పుతూనే తన ప్రతిభకు సాన పెట్టుకున్నాడు. హైడ్రోజన్‌తో నడిచే ద్విచక్ర వాహనాన్ని రూపకల్పన చేశాడు. అలాగే హైడ్రోజన్, పెట్రోల్‌లు రెండిటితో నిడిచే హైబ్రీడ్ వాహనంగా మార్పు చేశారు ఈ ఔత్సాహికుడు .
వరుణ్ కుమార్ అనే యువకుడి అనంతపురం జిల్లా గుంతకల్లు వాసి. సివిల్స్ సాధించాలని లక్ష్యంగా సాధన చేశాడు. కానీ, ప్రభుత్వ ఉద్యోగి అయిన తన తండ్రి మారణంతో కారుణ్య నియమకం ద్వారా గుంతకల్లు ప్రభుత్వ ఐటీఐలో సహాయ శిక్షణ అధికారిగా చేరాడు వరుణ్ కుమార్. కుటుంబానికి భరోసాగా ఉంటూ లక్ష్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
చిన్న వయసులోనే సాంకేతిక విద్య బోధన ఉద్యోగం రావడంతో విద్యార్థులతో కలిసిపోయి ఆవిష్కరణలు చేస్తున్నారు వరుణ్. విద్యార్థులతో కొత్త ఆలోచనలు పంచుకుంటూ, వారి ద్వారానే పరిశోధనలు చేయిస్తూ ఉత్తమ టీచర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది కడపలో నిర్వహించిన సాంకేతిక ఫెస్ట్‌లో విద్యార్థులతో కలిసి పాల్గొని నీటి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే విధానాన్ని ప్రదర్శించాడు వరుణ్.
సాంకేతిక ఫెస్ట్‌లో వీళ్ల ఆలోచన విధానానికి ద్వితీయ బహుమతి వచ్చిందని చెబుతున్నాడు వరుణ్. ఆ ప్రోత్సాహంతో మరింతగా ప్రయత్నాలు చేయాలనుకున్నాడు. ఐటీఐ విద్యార్థి రాము సాయం తీసుకుంటూ హైడ్రోజన్‌తో నడిచే వాహనం తయారీకి కావాల్సిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న పాత ద్విచక్ర వాహనాన్ని తీసుకుని ప్రయోగాలు చేయడం మెుదలు పెట్టారు.
దివ్యాంగులకు అండగా విద్యార్థులు - కొత్త టెక్నాలజీతో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు
హైడ్రోజన్‌ను వాహనానికి చోదకశక్తిగా వినియోగించుకునేలా ఎలక్ట్రోలైజర్ పరికరం రూపొందించాడు వరుణ్. ఇందుకోసం 35 వేల రూపాయలతో పరికరాలు, విడిభాగాలు కొనుగోలు చేశారు. పెట్రోల్ ద్విచక్ర వాహనానికి చిన్నపాటి సాంకేతిక మార్పులు చేసి, తను తయారు చేసిన ఎలక్ట్రోలైజర్ పరికరం అమర్చారు. దాని ద్వారా నీటి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేసి ఇంజన్‌లోకి పంప్ చేసేలా ఏర్పాటు చేశారు.
'హైడ్రోజన్ బైక్‌కు మరికొన్ని మార్పులు చేసి పెట్రోల్, హైడ్రోజన్‌లతో నడిచేలా హైబ్రీడ్ బైక్ తయారు చేయాలనుకుంటున్నాను. బ్యాటరీ సామర్థ్యం, ఎలక్ట్రోలైజర్ వంటి అంశాలను పున: పరిశీలించి సాంకేతికత జోడించాను. ఫలితంగా లీటర్ పెట్రోల్‌తో 35 కిలోమీటర్లు నడిచిన బైక్ మార్పు చేశాక 55 నుంచి 60 కిలోమీటర్లు వెళ్తుంది. అలాగే పూర్తి హైడ్రోజన్‌తో నడిపితే 80 నుంచి 90 కిలోమీటర్లు సులభంగా వెళ్లొచ్చు.' -వరుణ్ కుమార్, హైడ్రోజన్ బైక్ రూపకర్త
శిక్షకుడు వరుణ్‌తో కలిసి హైడ్రోజన్ బైక్ రూపొందించడం చాలా ఆనందంగా ఉందని ఐటీఐ చదువుతున్న విద్యార్థి రాము చెబుతున్నాడు. ఓవైపు ఇంటి అవసరాలు తీర్చుతూ, మరోవైపు రాత్రి వేళల్లో హైడ్రోజన్ బైక్ పరిశోధనలు నిర్వహించేవాడని వరుణ్ సోదరి యశస్విని అంటున్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా ప్రయత్నాలు ఆపలేదు వరుణ్. పట్టుదలతో సాధన చేసి అనుకున్న విధంగా బైక్ రూపొందించాడు. హైడ్రోజన్ శక్తితో నడిచే వాహనాలకు సాధారణంగా ఉన్న సమస్య పేలిపోయే అవకాశం ఉండటం. అయితే ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి ఫ్రేమ్ బ్లస్టర్ అనే పద్ధతితో చెక్ పెటుతున్నాడు. త్వరలో మరిన్ని ఫీచర్స్ జత చేసి పూర్తిగా హైడ్రో బైక్‌ను సిద్ధం చేస్తానని ధీమాగా చెబుతున్నాడు.