How To Make Kadapa Karam Dosa: దోశ.. చాలా మందికి ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్. పేరు వింటేనే నోట్లో నీళ్లూరిపోయే ఈ సౌత్ ఇండియన్ స్పెషల్ టిఫెన్‌కి.. బయట టిఫిన్ సెంటర్లు, హోటల్స్‌లోనూ మంచి గిరాకీ ఉంటుంది. అంతేకాదు.. హోటల్స్‌లో రకరకాల వెరైటీ దోశలు అందుబాటులో ఉంటాయి. ఇక ఇంట్లో కూడా ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ.. అంటూ ఎవరికి నచ్చినట్లుగా వారు వేసుకుంటుంటారు. అయితే ఎప్పుడూ అవే కాకుండా ఈసారి కడప స్టైల్లో కారం దోశ వేసుకోండి. టేస్ట్ అద్దిరిపోతుంది. పైగా దీనిని పప్పుల పొడి, బొంబాయి చట్నీతో తింటే వేరే లెవల్. మరి ఈ కాంబినేషన్లో అద్దిరిపోయే కడప కారం దోశ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్ధాలు
అట్ల పిండి కోసం:
- మినపప్పు - 1 కప్పు
- బియ్యం - మూడు కప్పులు
- మెంతులు - 1 టీస్పూన్
- ఉప్పు- సరిపడా
ఎర్ర కారం కోసం
- ఎండు మిరపకాయలు - 25
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఉల్లిపాయ - 2
- వేడి నీళ్లు - అర కప్పు
పప్పుల పొడి
- వెల్లుల్లి - 6
- పుట్నాల పప్పు - పావు కప్పు
ఎగ్ దోశ చేయడం ఇప్పుడు చాలా ఈజీ - ఈ టిప్స్ పాటించండి - టేస్ట్ ఎంజాయ్ చేయండి!
బొంబాయ్ చట్నీ
- చింతపండు- నిమ్మకాయంత
- శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావు టీ స్పూన్
- ఆవాలు - అర టీ స్పూన్
- మినపప్పు - అర టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఎండుమిర్చి - 2
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- అల్లం తరుగు - అర టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూన్
- కరివేపాకు - 2 రెబ్బలు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నీళ్లు - సరిపడా
తయారీ విధానం:
- ముందుగా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మినపప్పు, బియ్యం, మెంతులు విడివిడిగా సుమారు 4గంటల పాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత వాటిని కడిగి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా ఎక్కువ సార్లు గ్రైండ్ చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకుని 12 గంటల పాటు పులియబెట్టాలి.
- పిండి పులిసిన తర్వాత ఓ గిన్నెలోకి కొద్దిగా తీసుకుని ఉప్పు, సరిపడా నీళ్లు పోసి మామూలు దోశ పిండి కంటే కొంచెం మందంగా ఉండేలా కలిపి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఎర్రకారం కోసం వేడినీటిలో ఎండుమిర్చిని ఓ 15 నిమిషాలు నానబెట్టాలి.
- ఇప్పుడు పప్పుల పొడి కోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి పుట్నాల పప్పు, వెల్లుల్లి వేసి మెత్తని పొడిలా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఎండుమిర్చి నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి నానబెట్టిన ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి మిరపకాయలు నానబెట్టిన నీళ్లు కొద్దికొద్దిగా పోసుకుంటూ మెత్తని పేస్ట్‌లాగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు బొంబాయి చట్నీ కోసం చింతపండును నానబెట్టి రసం తీసుకోవాలి. ఆ రసంలో 350ml నీళ్లు, శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి.. అది హీట్ అయ్యాక, ఆవాలు, మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి.
- తాళింపు వేగిన తర్వాత మంట తగ్గించి శనగపిండి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి ఓ పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగు వేసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టి బాగా హీట్ చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత దోశ పిండిని వేసుకుని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత పిండి అంచుల వెంట నూనె వేసి కాల్చుకోవాలి. దోశ ఎర్రగా కాలుతున్నప్పుడు నెయ్యి వేసుకుని అట్టు అంతా పూసి కాల్చుకోవాలి.
- ఆ తర్వాత దానిని మరోవైపు తిప్పి 30 సెకన్లు కాల్చుకుని వెంటనే నెయ్యి పూసిన వైపు తిప్పుకోవాలి.
- ఆ తర్వాత దానిపై ఎర్ర కారం వేసి దోశ మొత్తం రుద్దుకోవాలి. ఆ పై పప్పుల పొడి చల్లి ప్లేట్లోకి తీసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే కడప కారం దోశ రెడీ. దీన్ని బొంబాయి చట్నీ, కొబ్బరి చట్నీతో తింటే అద్దిరిపోవాల్సిందే.
డయాబెటిస్ బాధితులు 'సోయా దోశ' తినండి - దెబ్బకే షుగర్ కంట్రోల్! - ఇలా ప్రిపేర్ చేసుకోండి!
హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ - ప్రిపరేషన్ వెరీ ఈజీ- పల్లీ చట్నీతో తింటే టేస్ట్ వేరే లెవల్!