Semiya Halwa Recipe In Telugu : హల్వా అంటే ఇష్టంలేని వారు దాదాపుగా ఎవరూ ఉండరు. ఎందుకంటే ఎన్ని రకాలు స్వీట్లు ఉన్నా.. వాటన్నింటిలో హల్వాకు ప్రత్యేక స్థానముంటుంది. అందుకు తగ్గట్లుగానే దీని టేస్ట్ కూడా భిన్నంగానే ఉంటుంది. దీన్ని ఎంత తిన్నా.. ఇంకా కొంచెం కావాలంటారు స్వీట్ లవర్స్. ఇదే కాకుండా తక్కువ సమయంలో తొందరగా ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలంటే కూడా అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది హల్వానే. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే స్వీట్ వంటల్లో.. హల్వాకు ప్రత్యేక స్థానం ఉంటుంది.
పైగా శ్రావణమాసం కూడా వచ్చేసింది. పూజలూ, వ్రతాలూ, నోములూ... అంటూ ఈ నెల మొత్తం ఏదో ఒక వేడుక ఉండటమే ఈ శ్రావణం ప్రత్యేకం. పూజల సమయంలో అమ్మవారికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా నివేదిస్తుంటారు. అటు అమ్మవారికి నైవేద్యంతోపాటు మీరు కూడా ఇష్టమైన స్వీట్ తినాలంటే.. హల్వా బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
అయితే.. చాలా మంది హల్వా అనగానే.. క్యారెట్, బ్రెడ్‌తోనే చేయాలని భావిస్తుంటారు. కానీ.. సేమ్యాతో కూడా హల్వా తయారు చేసుకోవచ్చని కొందరికే తెలుసు. మరి.. ఈజీగా సేమ్యాతో హల్వా ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- ఒక కప్పు బెల్లం
- ఒక కప్పు సేమ్యా
- 2 కప్పుల పాలు
- 4 యాలకులు
- నెయ్యి కొద్దిగా
- ఫుడ్ కలర్ (ఇష్టాన్ని బట్టి)
- డ్రై ఫ్రూట్స్
తయారీ విధానం..
- ముందుగా స్టౌవ్ ఆన్ చేసి ఓ గిన్నెలో బెల్లం, నీళ్లు పోసుకుని కరిగించుకోవాలి. (బెల్లం లేని వాళ్లు పంచదార వేసుకోవచ్చు)
- ఓ మిక్సీ జార్లో వేయించుకున్న సేమ్యా, యాలకులు తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
- మరో గిన్నెలో పాలను పోసుకుని బాగా మరిగించుకోవాలి.
- ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న సేమ్యా పౌడర్‌ను పాలలో వేసుకుని ఉండలు లేకుండా బాగా ఉడికించుకోవాలి.
- ఇందులోనే ముందుగానే చేసి పెట్టుకున్న బెల్లం నీటిని వడకట్టుకుని పోసుకోవాలి.
- బెల్లంనీరు సేమ్యాతో బాగా కలిసేవరకు స్టౌను సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత కాస్త నెయ్యి వేసి బాగా కలపాలి. పూర్తిగా అందులో కలిసిపోయాక మరికొంచెం నెయ్యి వేసుకొని కలపాలి.
- మీ ఇష్టాన్ని బట్టి రంగు కోసం ఫుడ్ కలర్‌ను కలపాలి
- నెయ్యి మొత్తం బయటకు వచ్చేవరకు మంటను సిమ్‌లో పెట్టి ఉడికించాలి.
- ఆ తర్వాత కొన్ని డ్రైఫ్రూట్స్ వేసుకుని ఒక్కసారి కలిపి స్టౌ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి.