Dosakaya Kalchina Pachadi : పచ్చడి అనగానే ఆవకాయ, టమాటా, ఉసిరికాయ వంటి నిల్వ పచ్చళ్లే ఎక్కువగా గుర్తుకు వస్తుంటాయి. ఇక రోటి పచ్చళ్లు అంటే టమాటా, గోంగూర వంటివి లిస్టులో ఉంటాయి. అయితే.. దోసకాయతోనూ చాలా మంది పచ్చడి చేసుకుంటారు. కానీ.. కాల్చిన దోసకాయతో పచ్చడి చేయడం అన్నది మాత్రం అందరికీ తెలియదు. దీన్ని ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే.. మళ్లీ మళ్లీ చేసుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి రుచి. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఈ దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- దోసకాయలు 2
- ఒక టేబుల్ స్పూన్ నూనె
- 15 వెల్లుల్లి పాయలు
- కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు
- రుచికి సరిపడా ఉప్పు
- ఒక కట్ట కొత్తిమీర
- పెద్ద ఉసిరి కాయంత చింతపండు
- ఒక టీ స్పూన్ ఆవాలు
- ఒక టీ స్పూన్ జీలకర్ర
- ఒక టీ స్పూన్ పసుపు
- కరివేపాకు రెబ్బలు
తయారీ విధానం..
- ముందుగా నిప్పుల మీద దోసకాయలను పూర్తిగా కాల్చుకోవాలి. నిప్పులు అందుబాటులో లేనివారు స్టౌమీదనే కాల్చుకోవచ్చు. ఒక కట్టె పుల్లను దోసకాయకు గుచ్చి, అన్నివైపులా కాలేటట్టు చూసుకోవాలి.
- ఆ తర్వాత వాటిని ఓ గిన్నెలో తీసుకుని నీళ్లు పోసుకోని కాసేపు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల దోసకాయలపైన ఉన్న పొట్టు త్వరగా వస్తుంది.
- కాసేపయ్యాక దోసకాయల పొట్టు తీసి పక్కకు చిన్నముక్కలుగా చేసి పెట్టుకోండి.
- మరోవైపు ఓ కడాయిని తీసుకుని నూనె పోసుకోవాలి.
- వేడయ్యాక వెల్లుల్లి పాయలు, పచ్చిమిర్చీ, ఉప్పు వేసి లో ఫ్లేమ్‌లో బాగా వేగనివ్వాలి.
- ఆ తర్వాత ఇందులోనే కాడలతో సహా కొత్తిమీరను వేసి వేయించుకోవాలి.
- అనంతరం స్టౌ ఆఫ్ చేసుకునే ముందు చింతపండు వేసుకోని దించేసుకోవాలి. (చింతపండును వేగనియ్యాల్సిన అవసరం లేదు. కడాయి వేడికి అందులో కలిసిపోతుంది)
- ఈ మిశ్రమాన్ని రోటిలో వేసుకొని కచ్చాపచ్చగా నూరుకోవాలి. రోలు లేనివారు మిక్సీ జార్లో వేసి మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇందులోకి.. ముందుగానే రెడీ చేసుకున్న దోసకాయలను వేసుకుని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.
తాళింపు విధానం..
- ముందుగా కడాయి వేడి చేసుకుని నూనె పోసుకోవాలి.
- ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. (వెల్లుల్లి ముందే వేసుకున్నాం కాబట్టి.. మీకు ఇష్టమైతే మళ్లీ వేసుకోవచ్చు)
- చివర్లో పసుపు వేసి కాస్త వేగాక ముందుగా చేసుకున్న పచ్చడిలో తాళింపును కలపాలి.
- అంతే.. అద్భుతమైన దోసకాయ పచ్చడి సిద్ధమైపోతుంది.
టేస్టీ టమాటా కొత్తిమీర పచ్చడి- వేడి వేడి అన్నంలో అయితే వేరే లెవల్! - tomato kothimeera chutney