How to Make Ragi Laddu Recipe : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వచ్చేసింది. ఇక పండగ అంటే పిండి వంటల ఘుమఘుమలు ఉండాల్సిందే. మురుకులు, అరిసెలు, సకినాలు వంటి రకరకాల పిండివంటలు తయారు చేసే పనిలో నిమగ్నమైపోయారు మహిళలు. అయితే, ఈ సంక్రాంతి పిండి వంటల్లో రాగి లడ్డూ తప్పక ఉండాల్సిందే. ఎక్కువ మంది పండగకు రవ్వ లడ్డూలు, బూందీ లడ్డూలు చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి రాగి లడ్డూలు చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఈ లడ్డూలు తింటే ఎముకలు బలంగా ఉంటాయి. మరి సింపుల్‌గా రాగి లడ్డూలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- రాగి పిండి-2 కప్పులు
- బెల్లం - కప్పున్నర
- జీడిపప్పు - పావకప్పు
- బాదం - 20
- యాలకుల పొడి - టీస్పూన్
- జాజికాయపొడి - 2 చిటికెలు
- నెయ్యి - సరిపడా
- ఎండుకొబ్బరి తురుము - పావు కప్పు
తయారీ విధానం :
- ముందుగా జీడిపప్పు, బాదం ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి రాగిపిండి వేయండి. స్టౌ లో ఫ్లేమ్‌లో ఉంచి టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి, పిండిని కలుపుతూ వేపండి.
- రాగి పిండి మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులో ఎండుకొబ్బరి తురుము వేసి వేపండి.
- అనంతరం పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే పాన్‌లో టేబుల్‌స్పూన్ నెయ్యి వేసి కరిగించండి.
- వేడివేడి నెయ్యిలో బాదం, జీడిపప్పు ముక్కలు వేసి దోరగా ఫ్రై చేయండి.
- ఇప్పుడు బాదం, జీడిపప్పులను రాగి పిండిలో నెయ్యితో సహా వేసి కలుపుకోండి.
- ఇందులోనే జాజికాయపొడి, యాలకుల పొడి వేసి మిక్స్ చేయండి.
- ఇప్పుడు అదే పాన్‌లో బెల్లం, కొద్దిగా నీరు వేసి కరిగించండి.
- బెల్లం పాకంలా కాకుండా పూర్తిగా కరిగించండి చాలు. కరిగిన బెల్లాన్ని రాగి పిండిలోకి జాలి గరిటె సహాయంతో వడకట్టుకోండి.
- ఆపై పిండిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు చేతులను చల్లటి నీళ్లలో ముంచి కాస్త నెయ్యి రాసుకుని లడ్డూలు కట్టుకోవాలి. ( ఈ రాగి లడ్డూలు కాస్త వేడిగా ఉన్నప్పుడే తయారు చేసుకోవాలి.)
- ఒకవేళ ఏ కారణంతోనైనా లడ్డూలు కట్టడం రాకపోతే, రెండు చెంచాల వేడివేడి నీరు రాగి పిండిలో పోసి లడ్డూలు తయారు చేసుకోండి. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ రాగి లడ్డూలు మీ ముందుంటాయి!
- నచ్చితే మీరు కూడా ఈ సంక్రాంతికి రాగి లడ్డూలు ట్రై చేయండి.
కోడిపందేలు, రికార్డింగ్ డాన్సులు - ఎక్కడెక్కడ ఏమేం స్పెషల్ అంటే!
"ఆంధ్రా స్టైల్ నాటుకోడి బిర్యానీ"- ఈ సంక్రాంతికి మరింత స్పైసీగా!