Hariyali Dum Aloo Recipe in Telugu : చాలా మంది ఫెవరేట్ డిష్‌లలో ఒకటి ఆలూ. ఇక పిల్లలైతే దీనితో చేసిన వంటకాలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, మీరు ఇప్పటి వరకు బంగాళదుంపతో రకరకాల రెసిపీలు ట్రై చేసి ఉంటారు. కానీ, ఈ సారి సరికొత్త రుచిలో ఈ వెరైటీ రెసిపీని ట్రై చేయండి. అదే.. "హరియాలీ దమ్ ఆలూ కర్రీ". ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు, వెజ్‌లో ఏదైనా స్పెషల్ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ట్రై చేయండి. తిన్నవారెవరైనా సరే టేస్ట్ అద్దిరిపోయిందని పొగడక మానరు! అంతేకాదు.. ఇది అన్నం, పులావ్, టిఫెన్స్లోకి సూపర్ కాంబినేషన్. ఇంతకీ, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం
కావాల్సిన పదార్థాలు :
- నాలుగు - బంగాళదుంపలు
- 1 - ఉల్లిపాయ
- 2 - పచ్చిమిర్చి
- పావు టీస్పూన్ - పసుపు
- పావు కప్పు - నూనె
- అర టీస్పూన్ - జీలకర్ర
- 6 - వెల్లుల్లి రెబ్బలు(సన్నగా కట్ చేసుకోవాలి)
- కొద్దిగా - ఉప్పు
- 1 టీస్పూన్ - వేయించిన జీలకర్ర పొడి
- అర టీస్పూన్ - పసుపు
- 1 టీస్పూన్ - ధనియాల పొడి
- అర టేబుల్‌స్పూన్ - కారం
- పావు టీస్పూన్ - గరం మసాలా
హరియాలీ పేస్ట్ కోసం :
- 1 పెద్దకట్ట - కొత్తిమీర
- 1 చిన్నకట్ట - పుదీనా
- 15 నుంచి 20 - వెల్లుల్లి రెబ్బలు
- కొద్దిగా - అల్లం
- 5 - పచ్చిమిర్చి
- పావు కప్పు - పెరుగు
వారెవ్వా అనిపించే "చెట్టినాడు ఆలూ ఫ్రై" - మసాలా నషాళానికి అంటాల్సిందే!
తయారీ విధానం :
- ముందుగా రెసిపీలోకి కావాల్సిన కొత్తిమీర, పుదీనాను కాడలతో సహా తరుక్కొని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి.
- తర్వాత ఆలుగడ్డలను పొట్టు తీసి క్యూబ్స్ మాదిరిగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే.. ఒక్కో బంగాళదుంపను 8 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బేబీ ఆలూ దొరికితే అవి తీసుకోవడం ఇంకా బెటర్.
- ఇప్పుడు స్టౌపై ఒక బౌల్లో లీటర్ వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు, పసుపుతో పాటు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను వేసి హై ఫ్లేమ్ మీద 80% వరకు ఉడికించుకోవాలి. ఆవిధంగా ఉడికించుకున్నాక వాటిని నీటి నుంచి వేరు చేసి మరో బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి.
- తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడక్కాక.. చల్లారిన ఆలూ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్ మీద లైట్ మధ్యమధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం రెసిపీలోకి కావాల్సిన హరియాలి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి, పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి.
కార్తిక మాసం స్పెషల్ - ఉల్లి, వెల్లుల్లి లేకుండా అద్దిరిపోయే రుచితో "ఆలూ కుర్మా" - ఇలా ట్రై చేయండి!
- ఇప్పుడు ఆలూ వేయించుకున్న పాన్‌లో అదే ఆయిల్లో జీలకర్ర, సన్నని వెల్లుల్లి తరుగు వేసుకొని అవి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తరుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక అందులో జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసుకొని బాగా కలిపి మరికాసేపు ఆ మిశ్రమాన్ని వేయించుకోవాలి. అనంతరం పావు కప్పు వాటర్ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
- అలా ఉడికించుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ మిశ్రమం, అరకప్పు వాటర్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి.
- ఆవిధంగా మిశ్రమం ఉడికిందనుకున్నాక.. ముందుగా ఫ్రై చేసుకున్న ఆలూ ముక్కలను వేసి ఒకసారి కలుపుకోవాలి.
- ఆ తర్వాత కర్రీ మధ్యలో ఒక చిన్న గిన్నె ఉంచి అందులో ఎర్రగా కాల్చిన బొగ్గు ముక్క వేసి దానిపై రెండు చిటికెళ్ల గరం మసాలా, నాలుగైదు డ్రాప్స్ నెయ్యి వేసి మూతపెట్టేసి మూడు నాలుగు నిమిషాల పాటు పొగను బయటకుపోనివ్వకుండా లో ఫ్లేమ్ మంట మీద కర్రీని ఉడకనివ్వాలి.
- మూడు నాలుగు నిమిషాలయ్యాక కూర బాగా మరిగి స్మోకీ అరోమా మొత్తం గ్రేవీకి పట్టి ఉంటుంది. అనంతరం ఆ చిన్న గిన్నె తీసి ఒకసారి కలుపుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "హరియాలీ స్మోకీ ఆలూ దమ్ కర్రీ" రెడీ!
లంచ్ బాక్స్ స్పెషల్ - యమ్మీ యమ్మీ "ఆలూ రైస్" - ఇలా చేస్తే పిల్లలు అస్సలు వద్దనకుండా తినేస్తారు!