Anantapur Man Achieving President's Award With Social Programs : ఉన్నతంగా చదవాలి, ఉద్యోగంలో చేరాలి, ఐదంకెల జీతం తీసుకోవాలనేదే నేటి యువత ఆలోచన. కానీ, అంతటితో జీవితానికి సార్థకత లభించదని భావించాడీ యువకుడు. ఎన్ఎస్ఎస్లో చేరిన అనతికాలంలో ఐక్యరాజ్యసమితి సదసులో పాల్గొని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఒనగూరే ప్రయోజానాలు వివరించి అక్కడి ప్రతినిధులచే ప్రశంసలు అందుకున్నాడు.
అనంతపురం జిల్లా కందిగోపుల గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు భరత్. తల్లిదండ్రులు ఆదినారాయణ, శారద చంద్రిక దేవి. పదో తరగతిలో ప్రతిభ కనబరిచి ఉచితంగా ఇంటర్ చదివాడు భరత్. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి బీటెక్‌లో చేరినా బాల్యం నుంచి సేవా కార్యక్రమాలపై ఉన్న ప్రేమతో డిగ్రీ చేయాలని భావించాడు.
డిగ్రీలో చేరిన తొలినాళ్లలోనే ఎన్ఎస్ఎస్లో చేరిన ఈ యువకుడు అనతి కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహించాడు. 39సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది యువతను అందులో భాగం చేశాడు. 35సార్లు రక్తదానం చేసి ఇండియన్ రెడ్‌క్రాస్ నుంచి ఉత్తమ రక్తదాత అవార్డు అందుకున్నాడు. తనతో సహా 236 మంది అవయవదానం చేయడానికి కీలకంగా వ్యవహరించాడు. ఓ వైపు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే 2 డిగ్రీలు, 7 పీజీలు పూర్తి చేసి ఔరా అనిపిస్తున్నాడు.
'సమయం దొరికినప్పుడల్లా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాను. నేను 2014 ఎన్నికల్లో 5వేల మంది కొత్త ఓటర్లను చేర్పించి భారత ఎన్నికల కమిషన్ నుంచి ఎలక్ట్రోలర్ అంబాసిడర్ అవార్డు పొందాను. గ్రామీణ యువతకు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మై గవర్నమెంట్ పోర్టల్‌కు ఆంబాసిడర్‌గా నియమితమయ్యాను. ఇవేకాక రాష్ట్రపతి అవార్డు, యూత్ ఛాంపియన్, యూకే నుంచి ప్రిన్సెస్ డయానా, యూఎన్ఓ యూత్ లీడర్, 2024లో కేంద్రం నుంచి అత్యున్నత యువ పురస్కారం వంటి అవార్డులు అందుకోవడం చాలా ఆనందంగా ఉన్నాను.' -భరత్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత
సేవా కార్యక్రమాలతో పాటు యువతను చైతన్యపరుస్తున్న భరత్‌ను ఐరాస ఆహ్వానించింది. 2017లో ఇండోనేషియాలో జరిగిన ఐరాస సదస్సులో పాల్గొన్నాడు. యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగితే ప్రపంచ దేశాలకు ఒనగూరే ప్రయోజనాలు వివరించి ఐరాస ప్రతినిధుల మన్ననలు పొందాడు. అప్పటి నుంచి జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటూ ప్రసంగిస్తున్నాడు భరత్.
పల్లెటూరి నుంచి ప్రపంచ స్థాయి వేదికల మీద ప్రసంగిస్తున్న భరత్ పట్ల కుటుంబ సభ్యులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భరత్ ఏ కాలేజీకి వెళ్లినా విద్యార్థులంతా అతని చుట్టే వాలిపోతారని అంటున్నారు. చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉందని చెబుతన్నారు.
యూఎన్ఓ నిర్వహిస్తున్న V-4 ప్రాజక్టుకు కో-ఆర్డినేటర్‌గా నియమితులైయ్యారు భరత్. దాంతో పాటు కేంద్రం యువతకు నిర్వహిస్తున్నవివిధ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ 2 బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తూ ఐరాస, కేంద్ర ప్రభుత్వ అధికారుల మన్ననలు పొందుతున్నాడు. భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.
చదువంటే ఉద్యోగమేనా!- వ్యవసాయంలో వెంకటాంపల్లి యువత విజయబావుటా - Young Farmers