How to Find the Purity of Coffee Powder: కాఫీ.. ఇది ఓ మూడ్ సెట్టర్. ఇది ఓ స్ట్రెస్ బస్టర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఒత్తిడికి చెక్ పెట్టి, ఉత్సాహాన్ని రెట్టించే ఓ టానిక్. అందుకే చాలా మంది దీనిని ఇష్టపడతారు. ఉదయాన్నే కప్పు కాఫీ తాగితే ఆ రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చని ఫీల్ అవుతుంటారు. అయితే, ఒకప్పుడు కాఫీ అంటే ఉదయం, సాయంత్రం మాత్రమే తాగేవారు. కానీ నేటి జనరేషన్లో ఎప్పుడుపడితే అప్పుడు కాఫీ తాగేస్తున్నారు. మెజార్టీ పీపుల్ కాఫీతోనే తమ డే స్టార్ట్ చేస్తున్నారు. మరి, ఇంత మంది తాగే కాఫీ పౌడర్ స్వచ్ఛంగా ఉండాలి కదా? కానీ కల్తీ రాయుళ్లు ఈ పౌడర్‌ను కూడా కల్తీ చేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. క్లే, షికోరి పౌడర్ వంటివి కాఫీ పొడిలో కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి కల్తీ కాఫీ పొడితో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం. అందుకే కాఫీ పొడి స్వచ్ఛతను కనుగొనేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొన్ని సూచనలు చెబుతోంది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కాఫీ పొడిలో క్లే గుర్తించడం:
- ముందుగా ఓ గాజు గ్లాస్‌లోకి వాటర్ తీసుకోవాలి.
- అందులోకి ఓ అర టీ స్పూన్ కాఫీ పౌడర్ వేసి ఓ నిమిషం పాటు ఆపకుండా కలపాలి.
- అలా కలిపిన తర్వాత ఓ 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి.
- ఐదు నిమిషాల తర్వాత స్వచ్ఛమైన కాఫీ పొడి అయితే గ్లాసు అడుగు భాగాన క్లే కి సంబంధించిన అవశేషాలు మిగలవు.
- అదే కాఫీ పొడి కల్తీ జరిగితే క్లే పార్టికల్స్ నీటి అడుగు భాగాన పేరుకుపోతాయి.
కాఫీ పొడిలో షికోరి గుర్తించడం:
- ముందుగా ఓ గాజు గ్లాస్‌లోకి వాటర్ తీసుకోవాలి.
- అందులోకి ఓ టీ స్పూన్ కాఫీ పౌడర్ వేయాలి.
- స్వచ్ఛమైన కాఫీ పొడి అయితే నీటిపై తేలుతూ కొద్ది మొత్తం అడుగుకు చేరుతుంది.
- అదే కాఫీ పొడి కల్తీ అయితే గ్లాసులో వేయగానే కలర్ మారుతుంది. దీన్ని బట్టి అందులో షికోరి కలిసినట్లు గుర్తించాలి.
ఫిల్టర్ పేపర్‌తో.. ఫిల్టర్ పేపర్‌తో కూడా కల్తీ కాఫీ పొడిని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- ముందుగా పేపర్‌పై రెండు స్పూన్ల కాఫీ పొడి వేయండి.
- తర్వాత టీ పొడిపై కొన్ని చుక్కల వాటర్ వేస్తుండాలి.
- కాఫీ పొడిలో కల్తీ జరిగితే ఫిల్టర్ పేపర్‌పై మరకలు ఏర్పడుతుంటాయి. ఒకవేళ ఎటువంటి మరకలు లేకపోతే అది స్వచ్ఛమైనదని అర్థం.
కల్తీ కాఫీ పొడి తీసుకుంటే కలిగే నష్టాలు:
- కల్తీ కాఫీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు హాని కలిగి, అజీర్తి, మలబద్ధకం లేదా విరేచనం వంటి సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు అంటున్నారు.
- కొన్ని కల్తీ పదార్థాల వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉందని.. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, చర్మం దురద, ఉబ్బసం వంటివి తీవ్రమైన అలర్జీల లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.
- కల్తీ కాఫీలోని కొన్ని రసాయనాలు తలనొప్పికి కారణం కావచ్చని చెబుతున్నారు.
- కొన్ని కల్తీ పదార్థాలు కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగించి దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని చెబుతున్నారు.
'కల్తీ కారం తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం' - మీ ఇంట్లో వాడే చిల్లీ పౌడర్ని ఇలా టెస్ట్ చేయండి!
అలర్ట్: మీరు ఉపయోగించే మసాలాలు స్వచ్ఛమైనవేనా? - FSSAI సూచనలు పాటించి క్షణాల్లో తెలుసుకోండిలా!