US President Elections Trump : అమెరికాలో అతిశక్తిమంతమైన సంస్థగా పేరున్న జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్‌ఆర్‌ఏ) మద్దతు రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు లభించింది. 2024 ఎన్నికల నేపథ్యంలో ఆయన టెక్సాస్‌లో వేల మంది ఎన్‌ఆర్‌ఏ సభ్యులను ఉద్దేశించి శనివారం ప్రసంగించారు. అంతకు కొద్ది సేపటి ముందే ఆ సంస్థ ట్రంప్‌నకు మద్దతు ప్రకటించింది.
తనకు మద్దతుగా నిలిచిన ఎన్ఆర్ఐ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు ఓటు వేసి వచ్చే నాలుగేళ్లలో తుపాకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. చట్టం పౌరులకు ఇచ్చిన ఆయుధాలను లాక్కోనేందుకు జో బైడెన్ గత 40 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. రాజ్యాంగంలోని రెండో సవరణను సంరక్షిస్తానని పేర్కొన్నారు. తుపాకీ యజమానులకు అత్యంత ఆప్తుడైన అధ్యక్షుడు తానేనని చెప్పారు.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న రాబర్ట్ ఎఫ్ కెనడీని రాడికల్ లెఫ్ట్ అని విమర్శించారు. ఒకప్పుడు ఆయన ఎన్‌ఆర్‌ఏను ఉగ్ర సంస్థతో పోల్చిరనే విషయాన్ని గుర్తు చేశారు. ఇక తాను అధ్యక్షుడిగా గెలిస్తే మీ తుపాకులపై ఎవరూ వేలు కూడా పెట్టలేరంటూ ఫిబ్రవరిలో జరిగిన ఎన్‌ఆర్‌ఏ సమావేశానికి హజరైనప్పుడు ట్రంప్ హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీలో ఎన్‌ఆర్‌ఏ సభ్యులు కూడా ఎక్కువ మందే ఉన్నారు.
ఏమిటీ రెండో సవరణ?
'అమెరికా స్వతంత్ర రాజ్య రక్షణ కోసం సైన్యానికి తోడుగా సాయుధ పౌరులతో ఏర్పడిన దళం (మిలీషియా) అవసరం. తదనుగుణంగా వ్యక్తులకు ఆయుధాలను ధరించే హక్కు ఉంది. ఆ హక్కుకు భంగం కలిగించకూడదు' అని నిర్దేశిస్తూ 1791లో అమెరికా రాజ్యాంగానికి రెండవ సవరణ తెచ్చారు. పౌరులు ఆయుధాలు కలిగి ఉండడానికి దీనిని ముడిపెడుతూ వక్రభాష్యం చెబుతున్నారని, నిజానికి ఈ సవరణలో పేర్కొన్న మిలీషియా అనే పదం నేషనల్ గార్డ్స్ వంటి జాతీయ భద్రతా దళాలకు మాత్రమే వర్తిస్తుందనే వాదన ఉంది. అందరూ తుపాకులు కొనడం వల్లనే కాల్పులు పెరిగిపోతున్నాయని, ఈ ధోరణిని నిరోధించాలని పౌర హక్కుల సంఘాలు ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. తుపాకులను నిషేధించకుండా జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్‌ఆర్‌ఏ) తదితర గ్రూపులు పైరవీలు చేస్తున్నాయి. దీనికి తుపాకీ ఉత్పత్తిదారుల నుంచే కాకుండా, ఆయుధధారులైన అమెరికన్ పౌరుల నుంచీ విరాళాలు వస్తుంటాయి.