US Election 2024 Polls Survey : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కన్నా ముందంజలో ఉన్నట్లు ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ సీబీఎస్ న్యూస్/యూగవ్ సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో వెల్లడైంది. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోటాపోటీ ఉండనుందని అంచనా వేసింది. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ఇరువురు అభ్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడం వల్ల ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు విజయావకాశాలు మెరుగయ్యాయి. ఆమెకు భారీగా విరాళాలు వచ్చాయి. కమలా హారిస్ సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. తాజాగా కమలా హారిస్‌కు 1977-81 మధ్య అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జిమ్మీ కార్టర్ మద్దతుపలికారు.
బైడెన్ వైదొలగడం వల్లే
ఇంతకు ముందు అమెరికా అధ్యక్ష రేసులో బైడెన్, ట్రంప్ ఉన్నప్పుడు, ముందస్తు సర్వేల్లో ట్రంప్‌దే కాస్త పైచేయిగా ఉండేది. గత నెలలో హత్యాయత్నం జరిగిన తర్వాత ట్రంప్‌నకు విజయావకాశాలు బాగా పెరిగాయి. అయితే బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల పరిస్థితి కొంత మారింది. పలు ర్యాలీల్లో కమలా హారిస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్ల ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ట్రంప్ ప్రతిపాదనను కమలా హారిస్ నో
మరోవైపు సెప్టెంబర్ 4న ఫాక్స్ న్యూస్ ఛానెల్ డిబేట్‌లో పాల్గొందామన్న ట్రంప్ ప్రతిపాదనను హారిస్ తిరస్కరించారు. బైడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు కుదిరిన అంగీకారం ప్రకారం, సెప్టెంబరు 10న ఎబీసీ న్యూస్ ఆతిథ్యంలో డిబేట్ జరుపుదామని తేల్చి చెప్పారు. 'ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే' అని గతంలో అన్న ట్రంప్ ఇప్పుడు నిర్దిష్ట తేదీన, నిర్దిష్ట సురక్షిత ప్రాంతంలో డిబేట్ చేద్దామని ప్రతిపాదిస్తుండటం విచిత్రంగా అనిపిస్తోందని కమలా హారిస్ ఎద్దేవా చేశారు. కాగా హారిస్‌కు రానున్న వారం రోజులు కీలకంగా మారనున్నాయి. ప్రచార వేగం పెంచడమే కాదు, మంగళవారంలోగా ఆమె తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. నలుగురు గవర్నర్లు, ఓ సెనెటర్, ఓ కేబినెట్ అధికారితో కూడిన జాబితా నుంచి హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.