Typhoon Yagi Effects In Vietnam : వియత్నాంలో పంజా విసిరిన సూపర్ టైఫూన్ యాగి భారీ నష్టాన్ని మిగిల్చింది. తుపాను ధాటికి వియత్నాంలో ఇప్పటివరకు 14మంది దుర్మరణం పాలయ్యారు. 176మంది గాయపడ్డారు. గత దశాబ్ధ కాలంలో విరుచుకుపడిన భయంకర తుపానుల్లో ఇది ఒకటని ప్రభుత్వం ప్రకటించింది. అటు చైనాలోనూ యాగి తుపాను బీభత్సం సృష్టించగా, అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
చైనా, హాంకాంగ్‌లో పెను బీభత్సం సృష్టించిన యాగి తుపాను వియత్నాంలోనూ భారీ నష్టం మిగిల్చింది. ఇప్పటివరకు నార్త్ వియత్నాం ప్రాంతాల్లో ప్రకృతి విలయానికి 14మంది బలయ్యారు. 176మంది గాయపడ్డారు. తుపాను తీవ్రత తగ్గినప్పటికీ అతిభారీ వర్షాలు కురుస్తాయని వియత్నాం వాతావరణశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. యాగి ధాటికి వేలాది వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడి 30 లక్షల మందికి సరఫరా నిలిచిపోయింది. లక్షా 20వేల హెక్టార్లలో చేతికొచ్చిన పంట ధ్వంసమైంది. 4 ఎయిర్‌పోర్టులు మూతపడ్డాయి. అనేక విమానాలు రద్దయ్యాయి. క్వాంగ్ నిన్, హైఫాంగ్ ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం గంటకు 149 కిలోమీటర్ల ప్రచండ వేగంతో తీరం దాటిన తుపాను 15 గంటలపాటు ఉగ్రరూపంతో పంజా విసిరి అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో వియత్నాంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వరదలు సంభవించడం సహా కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. తుపాను శాంతించిన ప్రాంతాల్లో సైన్యం, పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
వియత్నాంకు ముందు చైనాలో విజృంభించిన యాగి తీవ్రతకు హైనాన్, గ్వాంగ్ డాంగ్ ప్రావిన్సుల్లో చనిపోయినవారి సంఖ్య 4కు చేరింది. 95 మంది గాయపడ్డట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా వేలాది మంది సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు తెలిపింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హైనాన్‌ను తుపాను తీవ్రంగా దెబ్బతీసింది. వేలాద చెట్లు నేలకొరిగాయి. అనేక ప్రాంతాలు జలమయమై లక్షన్నర నివాసాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. 12 వేల 500 బేస్ స్టేషన్లు దెబ్బతినగా కమ్యూనికేషన్ నెట్‌వర్క్ పూర్తిగా అందుబాటులోకి రాలేదు.